స్తంభించిన జనజీవనం

స్తంభించిన జనజీవనం
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : తుఫాను ప్రభావంతో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ( Nalgonda district) అతలాకుతలం అయింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలోని పలు రహదారులు కోతకు గురయ్యాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భారీ వరద ప్రవాహాలతో చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండి అలుగు పోస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏర్పాటుచేసిన పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నీరు నిలిచిపోవడంతో వడ్లు పాడయ్యాయి.

దేవరకొండ మండలం (Devarakonda Mandal) లోని కొమ్మేపల్లి గ్రామంలోని ఎస్టీ ఆశ్రమ గురుకుల పాఠశాల వరద నీటిలో చిక్కుకు పోయింది. ఎగువ నుండి వస్తున్న భారీ వరద ప్రవాహంతో పాఠశాల భవనం చుట్టూ నీరు చేరింది. దీంతో పాఠశాలలో ఉంటున్న ఆరు వందల మంది విద్యార్థులు భయంతో వణికిపోయారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాఠశాల వద్దకు చేరుకొని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. రోప్ సహాయంతో విద్యార్థులను పాఠశాల భవనం నుండి రోడ్డు వరకు తీసుకొచ్చారు. వారిని ప్రత్యేక వాహనాలలో దేవరకొండ పట్టణంలోని బీసీ హాస్టల్ కు తరలించారు.

దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. దేవరకొండ డివిజన్‌లోని ఉప్పు వాగు, మైనంపల్లి , తాటి కోల్ వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కొండ భీమనపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. కొండ భీమనపల్లి గ్రామ సమీపంలోని పర్షియా తండా సమీపంలోని కుంట పూర్తిస్థాయిలో నిండి తెగిపోయే ప్రమాదం ఉండడంతో తండావాసులు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె పర్షియా తండాను సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


