విజయవాడ, క్రైమ్ (ఆంధ్రప్రభ) : విజయవాడలో సంచలనం సృష్టించిన ఇంటి దొంగతనం కేసును ఎన్టీఆర్ జిల్లా పోలీసు అధికారులు వేగంగా ఛేదించారు. సూర్యారావు పేటలోని చిలుకు దుర్గయ్య వీధిలోని ఒక ఇంటిలో పని చేసిన మహిళ, అదే ఇంటి నుండి సుమారు కోటి రూపాయలు 837 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఫిర్యాదుదారుడు సోమవారం సూర్యారావు పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన ఇంటిలోని బంగారు ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, ఈస్ట్ జోన్ డి.సి.పి. కె.జి.వి. సరిత, సూచనలతో, సౌత్ ఏ.సి.పి. డీ. పావన్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు మమ్మరం చేశారు.
గతంలో అదే ఇంటిలో పనిచేసి మానేసిన చీపురుపల్లి సుమలత అలియాస్ లతను అనుమానితురాలిగా గుర్తించి మారుతి నగర్ లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని ఒప్పుకొగా, దొంగిలించిన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, సుమలత ఆ ఇంటిలో పని చేస్తూ రెండు సంవత్సరాల కాలంలో, అవకాశం వచ్చినప్పుడల్లా ఒక్కోసారి కొద్దికొద్దిగా బంగారం దొంగిలించిందని తేలింది. ఆ తరువాత అనుమానం వస్తుందని భయపడి ఆరు నెలల క్రితం ఆ ఇంటి పని మానేసిందని తెలిపారు.
ఈ కేసును వేగంగా ఛేదించి చోరీ సొత్తును పూర్తిగా రికవరీ చేసిన సౌత్ ఏ.సి.పి. డి. పావన్ కుమార్, ఇన్‌స్పెక్టర్ షేక్ అహ్మద్ అలీ వారి బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.ఈ కార్యక్రమంలో డి.సి.పిలు కె. తిరుమలేశ్వర రెడ్డి, క్రైమ్ ఏ.డి.సి.పి. ఎం. రాజారావు, సౌత్ ఏ.సి.పి. డీ. పావన్ కుమార్, ఎస్.ఆర్.పేట ఇన్‌స్పెక్టర్ అహ్మద్ అలీ, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


