విశాఖ, కాకినాడల్లో భారీ వర్షం

(ఆంధ్రప్రభ, విశాఖపట్నం) : మొంథా (Montha) పంజాలో ఉత్తర కోస్తా ఉక్కిరిబిక్కిరవుతోంది. సోమవారం తెల్లవారుజామునే మొంథా ఆవులించింది. అది ప్రస్తుతం గంటకు 18 కి.మీల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోంది. సోమవారం మధ్యాహ్నానికి మొంథా తుఫాన్‌ కాకినాడకు 570 కి.మీలు, విశాఖపట్నానికి 560 కి.మీల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది.

సాయంత్రానికి మొంథా తుఫాన్‌ తీవ్ర తుఫాన్‌గా మారనుంది. తీవ్ర తుఫాన్ (severe storm) గా మారాక భారీ వర్షాలతో పాటు పెనుగాలులు మరింత తీవ్రంగా వీస్తాయి. దక్షిణ , ఉత్తర కోస్తాంధ్రల్లో గరిష్టంగా 10–15 సెం.మీల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు విశాఖ జిల్లా గాజువాకలో అత్యధికంగా 5.2 ‘సెంటీమీటర్లు, విశాఖలో 4.5 సెంటీమీటర్లు, అనకాపల్లి జిల్లా పరవాడలో 4.1 సెంటీమీటర్లు , శ్రీకాకుళం జిల్లా పోలాకిలో 3.7 సెంటీమీటర్లు , కోనసీమ జిల్లా మల్కిపురంలో 2.4 సెంటీమీటర్లు , కాకినాడలో 2 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది.

Leave a Reply