అధికారులు అప్రమత్తం
నర్సాపురంలో 16 షెల్టర్లు
తరలింపునకు సిద్ధం
( నర్సాపురం, ఆంధ్రప్రభ) : తీరంలో మొంథా తుఫాన్ అలజడి రేగింది. సముద్ర అలలు ఎగసి పడుతున్నాయి. తీరప్రాంతంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షం జోరందుకుంది. ప్రభుత్వం చేసిన తుఫాన్ ప్రకటన తో ప్రజలు ఇంటికి పరిమితం అయ్యారు. నర్సాపురం మండలం పెదమైనవానిలంక, చినలంక, తూర్పుతాళ్ళు మొగల్తూరు మండలం పేరుపాలెం, కె పి పాలెం గ్రామాలలో గల సముద్రం లో అలజడి రేగిందని, కెరటాలు ఉవ్వెత్తున ఎగిరి పడుతున్నాయని , ఆయా ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మొంథా తుఫాన్ ను ఎదుర్కునేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నియోజక వర్గం నర్సాపురం, మొగల్తూరు మండలం లలో సుమారు 25 గ్రామాలను తుఫాన్ ప్రభావిత గ్రామాలుగా అధికారులు గుర్తించారు. వీటి కోసం 16పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 15తుఫాన్ సెల్టర్స్, పెదమైన వానిలంక గ్రామం లోని డిజిటల్ భవనంను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసారు. వివిధ శాఖలకు చెందిన సుమారు వందకు పైగా ప్రభుత్వ సిబ్బంది తుఫాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని ఆర్ డి ఓ రాజు తెలిపారు. ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను, గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేశామన్నారు.
నియోజకవర్గంలో తీరప్రాంతం తొమ్మిది కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. తీరం వెంబడి ఉన్న తుఫాన్ ప్రభావిత గ్రామాలలో పోలీస్, రెవెన్యూ, మత్స్య శాఖ తో బాటు, విద్యుత్,వైద్య, పంచాయతీ శాఖ తదితర శాఖలకు చెందిన అధికారులు తుఫాన్ విధుల్లో నిమగ్నం అయ్యారు. వీరందరినీ నర్సాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి దాసి రాజు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు. చంటి పిల్లలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధులు, వికలాంగుల తో బాటు అరవై ఏళ్ల వయసు దాటిన వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలి రావాలని మైక్ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
తుఫాన్ ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తున్నారు. వాతావరణ కేంద్ర హెచ్చరికలతో తీర ప్రాంత గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలలో అధికార యంత్రాంగం తుఫాన్ ప్రభావం ను గమనిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. నర్సాపురం, మొగల్తూరు తహసీల్దార్ లు అయితం సత్యనారాయణ, సురేష్ లతో బాటు ఆచంట తహసిల్దార్ ఫాజిల్ లు తుఫాన్ విధుల్లో నిమగ్నమయ్యారు.

