నిరూపిస్తే.. ఉరి వేసుకుంటాను..

నిరూపిస్తే.. ఉరి వేసుకుంటాను..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : నకిలీ మద్యం వ్యవహారంలో తన ప్రమేయం ఉందని సిట్ అధికారులు నిరూపిస్తే.. దుర్గమ్మ(Durgamma) సాక్షిగా తాను ఉరి వేసుకుంటానని మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన నకిలీ మద్యం వ్యవహారంలో తాను ఎటువంటి తప్పు చేయలేదని ఎటువంటి పరీక్షలకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వద్ద ఈ రోజు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జోగి రమేష్(Jogi Ramesh) చేతిలో దీపం పెట్టుకుని తానేమీ తప్పు చేయలేదంటూ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు.

అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా నిండు హృదయంతో తాను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసినట్లు ప్రకటించారు. తన పై చంద్రబాబు, లోకేష్ కక్ష కట్టారని, ఎవరో చేసిన పాపాన్ని తనకు అంట గట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారని తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు పది రోజుల క్రితమే సత్య ప్రమాణానికి రావాలని చంద్రబాబు, లోకేష్(Chandrababu, Lokesh) ను రావాలని కోరినట్లు గుర్తు చేశారు.

వారు ఆలయాలకు రాలేకపోతే మేమే… చంద్రబాబు ఇంటికి వెళతామని చెప్పానన్నారు. భగవద్గీత పై ప్రమాణం చేస్తానని చెప్పానని, తన సవాల్ కు ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు.

ఎక్కడో జరిగిన అంశాన్ని తనకు అంటగట్టారని, నకిలీ మద్యంతో ఎవరికీ సంబంధమో జనార్ధనరావుకి ఎయిర్ పోర్టులో రెడ్ కార్పెట్ వేసిన మంత్రికి తెలుసన్నారు. రిమాండ్ రిపోర్ట్(remand report)లో తన పేరు ఎక్కడా లేదని, తన వ్యక్తిత్వాన్ని హననం చేసిన చంద్రబాబు, లోకేష్ తనకు తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తనను దెబ్బకొట్టాలంటే రాజకీయంగా దెబ్బకొట్టండి. అంతే కానీ తన వ్యక్తిత్వం పై కొట్టకండన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాతీర్పులో నిన్ను విడిచిపెట్టరు చంద్రబాబు అంటూ ఘాటుగా హెచ్చరించారు. సిట్ అధికారులు తన ప్రమేయం ఉందని నిరూపిస్తే దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన లైవ్ డిటెక్ట్(Live Detect) పరీక్షలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

Leave a Reply