రెండు బీచ్లు మూసివేత
- విద్యుత్తు సమస్యకు ప్రత్యామ్న ఏర్పాట్లు
- పట్టణాల్లో హోర్డింగులు తొలగింపు
- అన్నదాతల్లో తీవ్ర ఆందోళన
- కృష్ణాజిల్లా అధికారులు బిజీబిజీ
కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కారణంగా మొంథా తుఫాను హెచ్చరికలతో ప్రజలు, రైతుల్లో భయాందోళన నెలకొంది. 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. జిల్లాలోని అవనిగడ్డ(Avanigadda), పెడన, మచిలీపట్నం, గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు నియోజకవర్గాల్లోని అధికారులు కృష్ణా జిల్లా కలెక్టర్ డికె.బాలాజీ అప్రమత్తం చేశారు.
భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అధికారులు తప్పని సరిగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించి పూరిగుడిసెలు, గాలుల తాకిడికి నేలకొరిగే గృహస్థులను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంత(sea coast area) గ్రామాల ప్రజలను మరింత అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కృష్ణా జిల్లాపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారుల సూచనలతో జిల్లాలోని మంగినపూడి బీచ్లోకి ఎవరికి అనుమతించటం లేదు.

అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలోని హంసదీవి బీచ్ గేట్లు మూసివేశారు. మెరైన్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సముద్ర తీర ప్రాంతంలో ఎవరు సంచరించకుండా మైక్ ప్రచారం(mic campaign) చేస్తున్నారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలుంటాయని తెలపటంతో పలు గ్రామాల్లో హోర్డింగులు సైతం తొలగించారు.

తీర ప్రాంత గ్రామాల్లో అప్రమత్తం
సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న మచిలీపట్నం(Machilipatnam), పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని గ్రామాల ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం మెండుగా ఉన్నందున ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, కావాల్సిన సరుకులు ఆదివారం రోజే సిద్ధం చేసుకోవాలని, టార్చిలైట్లు, కొవ్వొత్తులు దగ్గర ఉంచుకుని, ముందుగానే ఫోన్లు చార్జింగ్ పెట్టుకోవాలని సూచించారు.
పాఠశాలలకు సెలవు
కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమ, మంగళ, బుధవారాల్లో సెలవు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులను, పలు వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ సమాచారం(Phone Information) అందించి ఇళ్లకు పంపించేశారు. వాతావరణ పరిస్థితులు మారకముందే ఆదివారం సాయంత్రం లోపే పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం అందించటంతో వారు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.

అన్నదాత గుండెల్లో భయం…భయం
కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేసినట్లు కృష్ణా జిల్లా వ్యవసాయాధికారిణి పద్మావతి తెలిపారు. వరి పంట గింజ పాలుపోసుకునే దశలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆందోళన చెందుతున్నారు. వర్షాలు భారీగా పడితే పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని తెలిపారు. పంట 20 రోజుల్లో చేతికొచ్చే సమయంలో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసి పంట నష్టపోతే తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంట నేలవాలి వర్షపు నీటి(rain water)లో మునిగిగే నష్టం భారీగానే ఉంటుందని, దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ఆందోళన చెందుతుందన్నారు. అప్పులు తెచ్చి సాగు చేపట్టిన కౌలు రైతులు భయాందోళన చెందుతున్నారు. రెక్కల కష్టం మీద ఆధారపడి జీవించే తమపై తుఫాను ద్వారా వర్షాల ప్రభావం పడితే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. 20 రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశగా ఉన్నామని, తుఫాన్ ప్రభావం జిల్లాపై పడకుండా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.
హోర్డింగులు తొలగింపు
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలోని పలు మండలాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్న భయంతో గ్రామాల్లోని హోర్డింగులు తొలగిస్తున్నారు. ఘంటసాల మండల ఎంపిడివో సుబ్బారావు ఆదేశాల మేరకు గ్రామపంచాయతీల్లో భారీ హోర్డింగులు తొలగిస్తున్నారు. అదేవిధంగా యానాదులకు అవగాహన కల్పించి పూరిగుడిసెలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు.

పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్(paper Krishna Prasad) సూచించారు. గుడివాడ రూరల్ మండలం మోటూరు గ్రామంలో తహసీల్దార్ టి.నాగసాయి కిరణ్, రూరల్ ఎస్ఐ ఎన్.చంటిబాబు గ్రామస్థులకు అవగాహన కల్పించి జాగ్రత్తగా ఉండాలన్నారు. పలు గ్రామాల్లో మైక్ ప్రచారం నిర్వహించారు.
మంగినపూడి బీచ్ మూసివేత
మంగినపూడి బీచ్ ను ఆదివారం జిల్లా కలెక్టర్ బాలాజీ సందర్శించి అక్కడి వాతావరణ పరిస్థితులు పరిశీలించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 27 నుంచి 29 వరకు కృష్ణా జిల్లా(Krishna District)లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీరాన్ని సందర్శించినట్లు తెలిపారు. తీర ప్రాంతంలో మత్స్యకారులు వేట కోసం వెళ్లకుండా అప్రమత్తం చేయాలని మెరైన్ అధికారులను ఆదేశించారు. బీచ్ ప్రాంతంలో పర్యవేక్షణలో ఉన్న భద్రత పోలీసు సిబ్బందితో మాట్లాడి సందర్శకులు ఎవరినీ లోనికి వెళ్లనివ్వకూడదని తెలిపారు.

