మొంథాను తట్టుకునేందుకు సర్వసన్నద్ధం

మొంథాను తట్టుకునేందుకు సర్వసన్నద్ధం

మచిలీపట్నం, ఆంధ్రప్రభ ప్రతినిధి : మెంతా తుఫాన్ ప్రభావం కృష్ణాజిల్లా(Krishna District) అంతట పడుతుందని ఈనెల 27 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురుస్తాయనే సమాచారంతో జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అధికారులు ,ప్రభుత్వ సిబ్బంది తుఫాను ప్రభావం ఉన్న మూడు రోజులు ఎట్టి పరిస్థితులను ఎటువంటి శెలవులు పెట్టవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలోని ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్(Control Room)ను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి బస్సులను, లారీలను రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

తుఫాను ప్రభావంతో నష్టపోయే గ్రామాలను ముందుగానే గుర్తించారు. అధికారులు ముంపు గ్రామాల పై తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధ్యయనం చేశారు. ఆహార పదార్థాల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్(District Collector) అధికారులు ఆదేశించారు. మచిలీపట్నం నగరంలోని ప్రజలు నాలుగైదు రోజుల వరకు సరిపడ కూరగాయలు సరుకులను నిత్యవసరాలు ముందుగానే భద్రపరుచుకున్నారు.

తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళనతో నగరంలోని రైతు బజార్ వినియోగదారులతో కిక్కిరిసింది. సముద్రంలోని మత్స్యకారులు ఎవరూ వేటకి వెళ్ళవద్దని, ఒకవేళ ఎవరైనా వేటకు వెళితే తక్షణమే వారిని వెనక్కి వచ్చే విధంగా సమాచారం అందించాలనీ సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తీర ప్రాంతాలలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా రెవిన్యూ(Revenue), పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావిత గ్రామాలలో ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి అదే గ్రామంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు ఉండి పర్యావేక్షించాలని అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

బందరు ఆర్డిఓ స్వాతి, మత్స్యశాఖ జిల్లా అధికారి నాగరాజులు ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని సిబ్బందికి సూచనలు ఇస్తూ ఉండాలని ఆదేశించారు. తుఫాను(Cyclone) ప్రభావంతో నాగాయలంక ,కోడూరు మండలాల్లోని పలు గ్రామాలలో నష్టం జరిగే ప్రమాదంఉంది. అలాగే బందరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో కూడా ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా ఈ మండలాలపై రెవెన్యూ, పోలీస్ సిబ్బంది దృష్టి పెట్టాలి.

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని సముద్ర స్నానాలకు వెళ్లే భక్తులకు తుఫాను ప్రభావంతో పోలీసులు సముద్ర స్నానాలు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పర్యటకులు సముద్రం లోకి వెళ్లకుండా మంగినపూడి బీచ్, హంసలదీవి బీచ్(Hamsala Devi Beach) వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తుఫాను ప్రమాదం పొంచి ఉన్న జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కలెక్టర్లను నియమించింది. కృష్ణాజిల్లా కు కలెక్టర్ అమ్రపాలిను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply