భారత్ ప్రత్యర్థి ఆసీస్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో అక్టోబర్ 30న ఢీ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్ లో ఎవరెవరు తలపడనున్నాయో తేలిపోయింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా ఘోరంగా ఓడిపోవడంతో సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరో తెలిసిపోయింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ అక్టోబర్ 30న సెమీ ఫైనల్లో ఢీకొట్టనుంది.

అయితే సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. ఆసీస్ అంటేనే ప్రత్యర్థి జట్లకు హడల్. ఆ జట్టు మొత్తం 12 సార్లు ప్రపంచ కప్ జరిగితే.. ఏడుసార్లు గెలిచేసింది. నాలుగుసార్లు ఇంగ్లండ్ అమ్మాయిలు కప్ నెగ్గారు. ఒకసారి న్యూజిలాండ్ విజేత. భారత్ కేవలం రెండుసార్లు 2005, 2017లో ఫైనల్ కు వెళ్లినా నిరాశే మిగిలింది. ఇంతవరకు మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలవలేదు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (13), దక్షిణాఫ్రికా (10), ఇంగ్లాండ్ (9), భారత్ (6) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ గెలిచినా 8 పాయింట్లతో నాలుగో స్థానంలోనే ఉంటుంది. దీంతో నిబంధనల ప్రకారం, ఒకటో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో, నాలుగో స్థానంలో ఉన్న భారత్ సెమీస్‌లో తలపడటం ఖాయమైంది. ప్రపంచ ఛాంపియన్ అయిన ఆసీస్‌తో సెమీస్ పోరు భారత్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. ఈ కీలక మ్యాచ్‌లో కెప్టెన్ స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి కీలక ప్లేయర్లు రాణించడంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
మన అమ్మాయిలు ఈసారైనా ప్రపంచ కప్ గెలిచే చాన్సుందా? సొంతగడ్డపై జరుగుతున్నందున అవకాశం మళ్లీ ఇప్పట్లో రాదు. అయితే, ఆస్ట్రేలియా సెమీస్ లో ఎదురుపడడమే సవాల్. పురుషులైనా, మహిళలైనాఆ నాకౌట్ మ్యాచ్ లలో మరింత పకడ్బందీగా ఆడడం ఆస్ట్రేలియన్ల స్వభావం. అందుకని భారత అమ్మాయిలు ఏ ఒక్క చాన్స్ కూడా ఇవ్వకుండా కంగారూలను కొట్టేయాలి.

