కర్నూలు, తిరుపతిలో పిడుగుల వాన
నెల్లూరు.. ప్రకాశం జిల్లాల్లో కుంభవృష్టి…
విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
(కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) : ఉత్తర అంతర్గత తమిళనాడు (TamilNadu), పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇది గురువారం సాధారణ అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాలపై కనిపించనుంది.
నెల్లూరు, ప్రకాశం జాగ్రత్త !
విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన ప్రకారం, ఈ వ్యవస్థ ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం (Nellore, Prakasam) జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రతీరానికి సమీప ప్రాంతాల్లో గాలులు కూడా బలంగా వీచే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కర్నూలు, తిరుపతిలో పిడుగుల వాన…
కర్నూలు, తిరుపతి (Kurnool, Tirupati) జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, పశువుల కాపరులు పిడుగుల సమయంలో చెట్ల క్రింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని సూచించింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాల తీవ్రత స్థానిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి మారవచ్చని చెప్పారు.
బయటకు రావొద్దు …
“ప్రజలు వర్షాల సమయంలో చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడరాదు. వాన సమయంలో గృహాల్లోనే ఉండి సురక్షితంగా ఉండాలి,” అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ (MD Prakhar Jain) తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సూచనలు పాటించాలని ఆయన సూచించారు.