క్ష‌ణికావేశంలో ఊపిరి తీసేసాడు

క్ష‌ణికావేశంలో ఊపిరి తీసేసాడు

  • భార్య గొంతు నులిమి.. ఆపై బ్రిడ్జి మీది నుంచి తోసేసిన భ‌ర్త‌
  • కుటుంబ క‌ల‌హాలే కార‌ణ‌మ‌ని అనుమాలు
  • నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘ‌ట‌న‌

(మంచిర్యాల ప్రతినిధి – ఆంధ్రప్రభ) : కట్టుకున్న భర్తే.. భార్యను కడతేర్చాడు. గొంతు నులిమి ఆపై బ్రిడ్జి పై నుంచి తోసేసి దారుణానికి ఒడిగ‌ట్టాడు.మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మందమర్రి మండల కేంద్రం బంగ్లాస్ ఏరియా(3వ జోన్)కు చెందిన జగన్నాధం కుమార్ ఆదివారం తన అత్తారింటికి వెళ్లాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలోని కనుకుల గ్రామానికి వెళ్లిన‌ కుమార్ అక్కడ అత్తింటి వారితో ఘర్షణ పడ్డారని తెలిసింది.

కాగా, అదే రోజు రాత్రి తన భార్య రజితను తీసుకుని కనుకుల నుంచి ద్విచక్ర వాహనం మీద బయలుదేరాడు. మార్గ‌మ‌ధ్య‌లో నస్పూర్ బ్రిడ్జి వద్ద భార్య రజితతో మరోసారి ఘర్షణ పడి తదనంతరం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. రాత్రే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మందమర్రి పట్టణంలోని మూడవ జోన్ బంగ్లాస్ ఏరియాలో ఉంటున్న కుమార్ – రజిత దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. తరచూ భార్యాభర్తలిద్దరూ గొడవ పడే వారని సమాచారం.

ఆదివారం తెల్లవారుజామున భాగ్యనగర్ రైలులో తన పుట్టింటికి వెళ్లిన‌ రజితను తిరిగి తీసుకొస్తానని చెప్పిన కుమార్ ఇలా హత్య చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘర్షణకు కారణాలు ఏమిటనేది ఇంకా పోలీసులు ధృవీకరించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితుడు కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Leave a Reply