జీఎస్టీ 2.0 తో భలే లాభం..

జీఎస్టీ 2.0 తో భలే లాభం..

  • ఏపీ వాణిజ్య పన్నుల డిప్యూటీ కమిషనర్ వివరణ

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల చిన్నవ్యాపారులు, స్వయం ఉపాధి దారులు, వినియోగదారులకు లాభం కలుగుతోందని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, నోడల్ అధికారి మురళీ మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో జ‌రిగిన‌ జిఎస్టీ 2.0 (ఉత్సవ్) అవగాహన కార్యక్రమాల ముగింపు సమావేశంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు.

జిల్లాలో జీఎస్టీ 2.0 సూపర్ జిఎస్టీ – సూపర్ సేవింగ్స్ సంస్కరణలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు నెలరోజులపాటు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయని పేర్కొన్నారు. గతంలో ఉన్న నాలుగు జిఎస్టీ స్లాబ్‌లు 5శాతం, 12శాతం , 18శాతం , 28 శాతం ను సంక్షిప్త పరచి రెండు స్లాబ్‌లుగా మార్చడం జరిగిందన్నారు.

కొన్ని వస్తువులపై పన్ను పూర్తిగా తొలగించడం వంటి కీలక మార్పులను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించామని తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించేందుకు హెల్ప్‌లైన్, సలహా డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో ఈ అవగాహన కార్యక్రమాలు సమర్థ‌వంతంగా పూర్తయ్యాయని చెప్పారు. కొత్త జిఎస్టీ విధానం వల్ల నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలపై పన్ను తగ్గింపుతో ప్రజలకు నేరుగా లాభాలు కలుగుతున్నాయని వివ‌రించారు.

అంతకుముందు డీఈఓ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, జీఎస్టీ అంశంపై ప్రదర్శనలు జరిగాయి. విద్యార్థులు తమ ప్రతిభతో జిఎస్టీ మార్పులను సృజనాత్మకంగా ప్రతిబింబించి ఆహుతులను ఆకట్టుకున్నారు.

Leave a Reply