శ్రీ సత్యసాయి జిల్లాలో అమలు
- ఆధునిక సాంకేతికత ద్వారా పెరగనున్న పాల ఉత్పత్తి, రైతుల ఆదాయం
- పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచన
శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 14 (ఆంధ్రప్రభ): జిల్లా పశుసంవర్థ శాఖ ఆధ్వర్యంలో పశువులలో ఆడ దూడలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉండే “సెక్స్ సార్టెడ్ సీమెన్’’ (sex sorted semen) సాంకేతికతను శ్రీ సత్యసాయి జిల్లాలో అమలు చేస్తున్నారు. ఈ ఆధునిక సాంకేతికత ద్వారా పశుసంవర్థక రంగంలో ఆడ పశువుల సంఖ్య పెరగడం, పాల ఉత్పత్తి అభివృద్ధి చెందడం, రైతుల ఆదాయం పెరుగుతుంది.
జిల్లాకు మొత్తం 26,000 సెక్స్ సార్టెడ్ సీమెన్ (SSS) సరఫరా చేయబడ్డాయి. వీటిని జిల్లాలోని పశుపాలక రైతులకు ఉచితంగా అందజేస్తున్నారు. అందువల్ల, జిల్లాలోని అన్ని పశుపాలక రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఆడ పశువుల జనాభా పెరగడం, పాల ఉత్పత్తి, ఉత్పాదకతలో గణనీయమైన పెరుగుదల సాధ్యమవుతుంది. అందుచేత, అన్ని మండల స్థాయి, వెటర్నరీ అధికారులు సంబంధిత సిబ్బంది ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం ఇవ్వడం సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.