జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) నోటిఫికేషన్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జారీ చేశారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలించి సక్రమంగా లేని వాటిని తిరస్కరిస్తారు. ఈనెల 24వ తేదీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు. అనంతరం ఎన్నిక రణరంగంలో ఎంత మంది ఉన్నారో తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి విడుదల చేస్తారు. వచ్చే నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. 16న ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. అంతవరకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది.
షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ రో్జు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ (RV Karnan) ఏర్పాట్లపై సమీక్షించారు. ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్ స్వీకరిస్తారు. సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్ పత్రాలను డౌన్ లోడు చేసుకుని పూర్తి చేసి సబ్మిట్ చేయొచ్చు. ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసినప్పటికీ నామినేషన్ల స్వీకరణ గడువులోగా స్వయంగా అభ్యర్థి హాజరు కావాల్సి ఉంటుంది. సంతకం, ప్రమాణం కోసం తప్పనిసరి.