16న కర్నూలు జిల్లాలో ప్రధాని పర్యటన

16న కర్నూలు జిల్లాలో ప్రధాని పర్యటన

  • అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి
  • స‌భ‌కు వ‌చ్చేవారికి ఇబ్బందులు త‌లెత్తొద్దు
  • ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌పై మంత్రి స‌మీక్ష‌

కర్నూలు బ్యూరో, అక్టోబర్ 11 (ఆంధ్రప్రభ) : కర్నూలు జిల్లాలో అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరగనున్న జీఎస్టీ భారీ బహిరంగ సభను విజ‌య‌వంతం చేయాల‌ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ద‌న్‌రెడ్డి కోరారు. అందుకు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని సూచించారు. ప్ర‌ధాని ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ద‌న్ రెడ్డి నేతృత్వంలో శ‌నివారం నిర్వ‌హించిన సన్నాహక సమావేశంలో మంత్రి మ‌ట్లాడారు.

రాబోయే మూడు, నాలుగు రోజులు రాత్రింబగళ్లు కష్టపడి పనిచేస్తేనే సభను విజయవంతంగా నిర్వహించగలం,” అని సూచించారు. అనంత‌రం ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్‌ ప్లాజా సమీపంలోని సభా ప్రాంగణంలోని కంట్రోల్‌ రూమ్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సభా వేదిక వద్ద భద్రతా చర్యలు, సభకు తరలి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా రవాణా, తాగునీరు, ట్రాఫిక్‌ సదుపాయాలపై విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా సభా ప్రాంగణంలో పార్కింగ్‌ ప్రాంతాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని, ఆహార పంపిణీ విషయంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా నిర్దేశిత ప్రాంతాల్లో భోజన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

దూరప్రాంతాల నుంచి సభకు వచ్చేవారికి ఆహార సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రవాణా సంబంధిత అంశాల్లో ఏ వాహనం ఎక్కడికి వెళ్లాలో ముందుగానే ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, స్థానికంగా టోల్‌గేట్ల మూలంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైతే ఒక రోజు పాటు వాటిని మూసివేయాలని తెలిపారు. సమావేశంలో మంత్రి టీజీ భరత్, సీనియర్‌ ఐఏఎస్‌ వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్‌ డా. ఎ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply