-గాయత్రి ఉప్పలపాటి

గాయత్రి ఉప్పలపాటి

2025లో ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం “విపత్తులు మరియు అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం”
అత్యవసర పరిస్థితుల ప్రభావానికి గురైన వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం ఈ ఏడాది ముఖ్య ఉద్దేశ్యం. ఈ థీమ్ ని సమిష్టిగా నిర్దేశించినది వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) మరియు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ (ప్రపంచ మానసిక ఆరోగ్య సమాఖ్య) నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (జాతీయ నేర గణాంకాల విభాగం) నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 2% ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. విద్యార్థుల్లో ప్రతి యేటా 4% ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.

ఈ ఆత్మహత్యలకు ముఖ్య కారణాలు, పరీక్షల ఒత్తిడి, కృంగుబాటు మరియు ఆందోళన వంటి మానసిక సమస్యలు, సోషల్ మీడియా ప్రభావం, గాడ్జెట్స్ వ్యసనం వంటివి. ఇండియన్ సైకియాట్రీ సొసైటీ నిర్వహించిన(భారత మానసిక సంబంధమైన సమస్యల సంస్థ) సర్వే ప్రకారం యువతలో 70 శాతం రోజుకు మూడు నించి నాలుగు గంటలకు మించి ఫోన్ వాడుతున్నారు. అందులో ఎక్కువగా సోషల్ మీడియా చూస్తున్నారు దాని వలన మానసిక సమస్యల భారిన పడుతున్నారు.

కుటుంబంలో మానసిక బంధం బలంగా ఉండడము, స్నేహితులు మరియి సమాజంలో పరస్పర సత్సంబంధాలు చాలా అవసరం. అప్పుడే ఈ రీల్ బంధాల కంటే రియల్ బంధాల యొక్క ప్రాముఖ్యత అందరికీ అర్థమవుతుంది.

ఇన్ని సమస్యలు వున్నా, మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళడానికి లేదా తీసుకెళ్లాడానికి సంకోచిస్తున్నాము. దానికి కారణలేమిటి? అవగాహనా లోపమే.

మానసిక అనారోగ్యం గురించి వున్న కొన్ని అపోహలు మరియు వాస్తవాలు :
అపోహ : మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం అంత ముఖ్యం కాదు.
వాస్తవం : ఆరోగ్యకరమైన శరీరం ఆరోగ్యకరమైన మనసు ఉన్నప్పుడే ఒక వ్యక్తి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందించగలుగుతారు. శరీరానికి సమస్యలు వచ్చినప్పుడు ఎలా అయితే అంగీకరించి డాక్టర్ల దగ్గరికి వెళ్తామో మానసిక అనారోగ్యాలు కలిగినపుడు కూడా అంతే నిర్భయంగా మానసిక నిపుణుల దగ్గరికి వెళ్ళగలగాలి.

శారీరిక అనారోగ్యం ఎలా అయితే మన పురోగతికి అడ్డంకిగా నిలుస్తుందో మానసిక అనారోగ్యం కూడా మన పురోగతికి అడ్డంకిగా నిలుస్తుంది. కాబట్టి శారీరిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం
అపోహ : మానసిక అనారోగ్యం బలహీన వ్యక్తులకి మాత్రమే వస్తుంది.
వాస్తవం : మానసిక అనారోగ్యాన్ని ఒక బలహీనతగా చూసే దృక్పథాన్ని మార్చుకోవాలి. మానసిక అనారోగ్యం అన్నది ఎవరికైనా రావచ్చు. మానసిక అనారోగ్యానికి శారీరిక, వంశపారంపర్య, మానసిక, సామాజిక మరియు కల్చరల్ కారణాలు ఉంటాయి.
అపోహ : మానసిక అనారోగ్యాల గురించి మాట్లాడడం వలన అవి ఇంకా ముదిరిపోతాయి.
వాస్తవం : మానసిక అనారోగ్యం అన్నది దాని గురించి మాట్లాడడం వలన ఎక్కువైపోదు, ఎప్పుడైతే వాటి గురించి నిస్సంకోచంగా మాట్లాడతామో, అప్పుడే అవి తగ్గుముఖం పడతాయి. మానసిక అనారోగ్యాన్ని ఒక బలహీనతగానో, అవమానంగానో చూడడం ఆపినప్పుడే మనం వాటి గురించి నిర్భయంగా మాట్లాడ గలుగుతాము. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కార్యాలయాలు, సమాజమ్ లో అవగాహన పెరిగినపుడే మానసిక అనారోగ్యం గురించి నిస్సంకోచంగా మాట్లాడగలుగుతాము.

అపోహ : కౌన్సిలింగ్ అంటే వృధా ఖర్చు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఇచ్చే సలహాలు వీరు ఇస్తారు.
వాస్తవం : కౌన్సిలింగ్/థెరపీలో మీ ఆలోచనలు, భావాలు మరియు ప్రవర్తన మధ్య వున్న సంబంధం తెలియబరుస్తారు. తద్వారా వాటిలోని మార్పుపై దృష్టి పెడతారు. కౌన్సిలింగ్ లో వ్యక్తి యొక్క సమస్యలకు ఆ వ్యక్తి చేతే పరిష్కారం రాబడతారు.
తద్వారా కష్టకాలంలో నిర్ణయాలు తీసుకొనే శక్తి వస్తుంది. అలాగే, భావొద్వేగాలను నియంత్రణలో పెట్టుకొని, చక్కటి నిర్ణయాలు తీసుకొనే శక్తి దీర్ఘకాలంలో వస్తుంది.
ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా మన అందరమూ వేసుకోవాల్సిన ప్రశ్నలు:

ఎంత వరకు మన దృష్టి మానసిక ఆరోగ్యంపై వుంది?

శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామా?

మనసు బాగాలేదు అని నిర్భయంగా నిస్సంకోచంగా తోటి వారితో మన భావాలు
పంచుకుంటున్నామా?

గాడ్జెట్స్ నిండిన ఈ పోటీ ప్రపంచంలో మన మనసు మరియు మన చుట్టూ వున్న వారి మనసు
గమనిస్తున్నామా ?

మానసిక ఆరోగ్యం వలనే బంధాలు బలపడతాయి అన్నది గ్రహిస్తున్నామా?
ఎప్పుడైతే మానసిక అనారోగ్యం పై అవగాహనా పెంచుకొని మనందరి దృక్పథం మార్చుకుంటామో అప్పుడే మనందరమూ మానసికంగా ఆరోగ్యావంతమైన భారతదేశన్ని నిర్మించే దిశగా ప్రయాణం చేస్తాము. ఇది మనందిరి సమిష్టి కృషి వలనే సాధ్యం అవుతుంది.

గాయత్రి ఉప్పలపాటి

Counselling Psychologist and Behavioural Trainer

Founder – Swecha Mental Health Services

M. A Clinical Psychology

M. Phil Counselling Psychology

Leave a Reply