- పొర్లుతున్న దిగువ చెరువులు
- తమిళనాడుకు వరద వరం
వీ.కోట, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో గురువారం రాత్రి నుంచి కులుస్తున్న వర్షాల కారణంగా హంద్రీ నీవా కాలువకు నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో కుప్పం నియోజకవర్గం వి కోట మండలం కృష్ణాపురం పంచాయతీ వెంకటపల్లి వద్ద హంద్రీ నీవా కాలువకు గండిపడింది.
ఈ కాలువ నుంచి నిరంతరాయగా దిగువనున్న అటవీ ప్రాంతం మీదగా చిన్న శ్యామా, నాగిరెడ్డిపల్లి చెరువులకు నీరు చేరుతోంది. రాత్రికి రాత్రి రెండు చెరువులు పూర్తిగా నిండాయి. మిగిలిన నీరు వృధాగా తమిళనాడుకు తరలుతోంది. కర్ణాటక లో భారీ వర్షంతో గంగమ్మ ఏరు ఉధృతంగా ప్రవహిస్తోంది.వీ.కోట మండలంలో చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి.
కుంబర్లపల్లె నుంచి కల్లుపలికు గంగమ్మ ఏరు మీదుగా వెళ్లే మార్గంలో వరద పరవళ్లతో రాకపోకలకు అంతరాయం నెలకొంది. గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఆ ప్రవాహం లోనే రాకపోకలు సాగిస్తున్నారు.
గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు తోడు హంద్రీ నీవా నుంచి నీటిని విడుదల చేయడంతో పైపల్లె రాయప్ప చెరువు, నిండి ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్రపల్లి చెరువు సైతం 75 శాతం నీటితో కళకళలాడుతోంది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు మండల పరిధిలో పలు గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


