సింగ‌రేణిలో అభిప్రాయ సేక‌ర‌ణ‌

గోదావరిఖని, ఆంధ్ర‌ప్ర‌భ : బొగ్గు పరిశ్రమలో దీర్ఘకాలిక సమస్యల సాధనకు సింగరేణిలో సీఐటీయూ అభిప్రాయ సేకరణను చేపట్టింది. ఈ రోజు కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులపై ఓటింగ్ విధానం ప్రారంభించారు. ప్రధానంగా సింగరేణిలో దశాబ్దాల పాటు పనిచేసిన గని కార్మికుల చిరకాల కోరిక సొంతింటి కల నెరవేర్చాలని, కార్మికుల మనోగతం తెలుసుకునేందుకు గనులపై ఓటింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. రెండు రోజులపాటు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 డివిజన్ ల‌లో ఉన్న బొగ్గు గనులు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో ఈ ఓటింగ్ విధానం కొనసాగుతోంది. సింగరేణి పరిశ్రమలో పనిచేసే మెజారిటీ కార్మికుల మనోగతం తెలుసుకోవడంతోపాటు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ విధానాన్ని చేపట్టారు.

కార్మికుల మ‌నోగ‌తాన్ని తెలుసుకుని…
మెజారిటీ కార్మికుల మనుగతాన్ని ఓటింగ్ ద్వారా సేకరించిన అనంతరం సమస్యల సాధన కోసం చేపట్టవలసిన కార్యాచ‌ర‌ణ‌ ఉంటుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ( సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి తెలిపారు. బొగ్గు గని కార్మికుల సొంతింటి కల నెరవేరే వరకు సీఐటీయూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సింగరేణిలో కార్మికుల అభిప్రాయాలను సేకరించేందుకు యాజమాన్యం అడ్డుపడుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా కార్మికుల సొంతింటి కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఓట్ల లెక్కింపు ఫలితాల ఆధారంగా కార్మికుల డిమాండ్లను అన్ని యూనియన్లు బలపరచాలని ఆయన కోరారు. ప్రకృతి విరుద్ధంగా భూగర్భంలో పనిచేసిన కార్మికునికి పదవి విరమణ సమయానికి గూడు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం సంస్థ స్థలాలను కార్మికులకు కేటాయిస్తే హెచ్ఆర్ఏ ను ఈఎంఐ రూపంలో చెల్లించి సొంతింటి కలను సహకారం చేసుకునే అవకాశం ఉందన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు సింగరేణి యాజమాన్యం కార్మికుల న్యాయమైన సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేయాలని సూచించారు.

Leave a Reply