సైదాపూర్, ఆంధ్రప్రభ : అన్నం పెట్టే అన్నదాతలు యూరియా (Urea) కోసం అనేక అవస్థలు పడుతున్నారు. యూరియా కోసం తెల్లవారు జాము నుంచి బారులు తీరుతున్నారు. యూరియా కొరత లేదని ఓవైపు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్న గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. కరీంనగర్ (Karimnagar) జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో గల ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ సీడ్స్ దుకాణం ముందు భారీ క్యూలైన్ కట్టారు.
సొసైటీలకు, ఫెర్టిలైజర్ దుకాణాల (Fertilizer Shops) కు యూరియా వస్తుందని తెలువడంతో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా పిల్లలతో కలిసి వచ్చి బారులు తీరారు. కొద్ది మంది రైతులకే యూరియా లభించడంతో రైతులు నిరాశగా వెనుదిరిగారు. వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతోనే యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని రైతులు (Farmers) తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా కొరత వల్ల పనులన్నీ మానుకుని కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఇలాకలో ఇలాంటి పరిస్థితి ఉండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కోరత లేకుండా యూరియా వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.