కొల్చారం, ఆంధ్రప్రభ : జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని మెదక్ – హైదరాబాద్ జాతీయ రహదారి(Medak – Hyderabad National Highway)పై నిర్వాసితులు ఆందోళనకు దిగారు. గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అప్పాజిపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులకు భూములు కోల్పోయారు.
వారికి అప్పటి శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి(Chilumula Madan Reddy) సుమారు 40 వరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయిస్తానని, అలాగే పాత రోడ్డు స్థలాన్ని వాడుకోవచ్చునని హామీ ఇచ్చారు.
రెవెన్యూ అధికారులు పాత రోడ్డు స్థలంలో కడ్డీలు వేయడంతో ఆగ్రహించిన రైతులు బుధవారం ఉదయం రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకిరువైపులా భారీగా ట్రాఫిక్ జామైంది. స్థానిక ఎస్సై అహ్మద్ మోహినుద్దీన్(SI Ahmed Mohinuddin), మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి(CI Rajasekhar Reddy)లు చేరుకొని కలెక్టర్‌తో మాట్లాడుతామని హామీ ఇచ్చి నిర్వాసితులను శాంతింపజేశారు.

