సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐ (CBI) విచారణకు అప్పగించాలని శాసనసభలో ప్రకటించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు, ప్రజా నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ఇప్పటికే మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (Justice Pinaki Chandra Ghose commission) ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయగా, ఆ కమిషన్ తన నివేదికను జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4న కేబినెట్ ఆ నివేదికను ఆమోదించింది.
ఘోష్ కమిషన్ తన నివేదికలో అనేక అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం, ఆర్థిక అక్రమాలు (Financial irregularities) చోటుచేసుకున్నాయని స్పష్టం చేసింది. మూడు బ్యారేజీల నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, అలాగే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు రూపకల్పనలోనే విఫలమైందని తేల్చింది.
జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కూడా మేడిగడ్డ బ్యారేజీ నష్టానికి తగిన ప్రణాళిక లేకపోవడం, డిజైన్ లోపాలు, నాణ్యత నియంత్రణ లోపాలే కారణమని నివేదికలో పేర్కొంది. తక్కువ నాణ్యత (Low quality) తో నిర్మాణం జరగడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని స్పష్టం చేసింది. ఈ రెండు నివేదికలు కూడా మరింత లోతైన దర్యాప్తు అవసరాన్ని స్పష్టంచేశాయి.
