హైదరాబాద్ : ప్రభుత్వం, అధికారుల బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యం కారణంగానే ఎంతో భవిష్యత్ ఉన్న ఆరుగురు యువకులు బలయ్యారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani SrinivasYadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాంతపూర్ లోని గోఖలే నగర్ (Gokhale Nagar) లో శ్రీ కృష్ణుని శోభాయాత్ర సందర్భంగా విద్యుత్ షాక్ ప్రమాదం జరిగి ఆరుగురు మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పలువురు నాయకులతో కలిసి మృతుల నివాసాలకు వెళ్ళి బాధిత కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ప్రమాదకరంగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగల (High-tension electrical wires) ను తొలగించాలని స్థానిక ప్రజలు అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని, ప్రమాదం జరిగిన తర్వాత అర్ధరాత్రి ఆఘమేఘాల మీద తొలగించారని ధ్వజమెత్తారు. ఫిర్యాదు (complaint) చేసినప్పుడు స్పందించి ఉంటే ఈ ప్రమాదం జరిగేదా? అని ప్రశ్నించారు. యువకుల కుటుంబాల్లో తీరని విషాదం (sad tragedy) నింపిన పాపం ఈ ప్రభుత్వానిది కాదా ? అని ప్రశ్నించారు. ఎంతో భవిష్యత్ కలిగిన యువకులకు 5లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం ప్రకటించి తిరిగి తీసుకురాలేని ప్రాణాలకు వెలకడతారా అని నిలదీశారు.

ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా సంఘటన స్థలానికి రాకపోవడం బాధాకరమన్నారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సహాయం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ (demand) చేశారు. ఒక వైపు భారీ వర్షాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటిస్తూనే అందుకు అనుగుణంగా ప్రభుత్వం, అధికారులు అవసరమైన చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. ఎప్పుడు ఏం చేయాలి.. ఏం చర్యలు తీసుకోవాలనే విషయాలపై ఈ ప్రభుత్వంకు కనీస అవగాహన లేకుండా పోయిందని చెప్పారు.