ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మల్కాజ్‌గిరికి చెందిన దినేష్ పాణ్యం అనే మోసగాడు.. అధిక వడ్డీకి ఆశపడిన అమాయకులను లక్ష్యంగా చేసుకుని, దాదాపు రూ. 20 కోట్లకు పైగా మోసం (scammer) చేసి పరారయ్యాడు. ఈ మోసానికి గురైన వారిలో వృద్ధులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే, బ్యాంకులు ఇచ్చే వడ్డీ కన్నా ఎక్కువ లాభాలు ఇస్తానని నమ్మబలికి, సుమారు 170 మంది నుంచి రూ. 20 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దినేష్ ముందుగా కొంతమంది పెట్టుబడిదారులకు వారి పెట్టుబడిపై క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించి, నమ్మకం పెంచుకున్నాడు. దీంతో, అధిక రాబడి వస్తుందనే ఆశతో, మరింత మంది అతడి వద్ద పెట్టుబడులు పెట్టారు. ఈ మోసగాడు ఒక పక్క ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ, మరో పక్క ప్రజలకు పెట్టుబడులపై రాబడి ఇస్తానని మోసం చేశాడు. అయితే, ఇటీవల దినేష్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. దీంతో, మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దినేష్ కోసం గాలిస్తున్నారు. పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అధిక రాబడి ఆశ చూపి మోసం చేసేవారి విషయంలో ఎప్పుడూ అనుమానంగా ఉండాలని సూచించారు.