ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఒక మధురమైన పాట వింటే మనసుకు ఎంతో హాయి కలుగుతుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా సంగీతం (Music) వింటే మనసు ఆనంద సాగరంలో తేలి ఆడుతుంది. సంగీతం మెదడులోని చాలా భాగాలను ఉత్తేజితం పరుచుతుంది. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యం, భావోద్వేగాలు, ఆలోచన(Music, physical, mental health, emotions, thinking)లపై కూడా ప్రభావం చూపుతుంది. సంగీతం కారణంగా హిప్పోక్యాంపస్, హైపోథలమస్, హిప్పోక్యాంపస్ భాగాలతో కూడిన లింబిక్ వ్యవస్థ ఉత్తేజితమైనప్పుడు భావోద్వేగాల ప్రతిస్పందన మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రవర్తన, చురుకుతనం, జ్ఞాపకశక్తి (memory)ని ఈ వ్యవస్థే పర్యవేక్షిస్తుందని, మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ (బూడిదరంగు పదార్థం) ప్రేరేపితమైనప్పుడు డ్యాన్స్ (dance) చేసేలా పురికొల్పుతుందని, లయకు అనుగుణంగా శరీరం కదిలేలా చేస్తుందని పేర్కొంటున్నారు. సంగీతం వినడం వల్ల మెదడులోని ఆలోచన, సంచలనం, కదలిక, భావోద్వేగాలకు సంబంధించిన వివిధ నిర్మాణాలు ఉత్తేజితమవుతాయని, ఈ ప్రభావాలు అనేవి శారీరక, మానసిక ప్రయోజనాలను కలిగి ఉండవచ్చని NIH అధ్యయనంలో పేర్కొంది. సంగీతం వల్ల చేతులు, కాళ్లు మధ్య సమన్వయంతో పాటు చలన నైపుణ్యాలు వృద్ధి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మెదడు అనుసంధానం మెరుగవుతుందని పేర్కొంటున్నారు.
ప్రయోజనాలెన్నో..
జ్ఞాపకశక్తి భద్రంగా ఉండటంతో పాటు మరింతగా మెరుగవుతుంది. సృజనాత్మకత, ఏకాగ్రత, జాగరూకత ఎక్కువవుతుంది. త్వరగా స్పందించటం అలవాటు అవుతుంది. ప్రాదేశిక దృశ్యాల ఊహాత్మక శక్తి (Imagination)పెరుగుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు మెదడు ఎదుగుదల ఇనుమడిస్తుంది. సంగీతం ప్లే చేసినప్పుడు రక్తం మరింత సులభంగా ప్రవహిస్తుందని పలు పరిశోధనలో తేలింది. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటును తగ్గించడంతో పాటు కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయిలను తగ్గించి, రక్తంలో సెరోటోనిన్, ఎండార్ఫిన్ స్థాయిలను పెంచుతుందని New Jersey Agricultural Experiment Station అధ్యయనంలో పేర్కొంది. సంగీతం వినడం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్లో మోషన్ సాంగ్స్ వింటే గుండె కొట్టుకునే వేగం, శ్వాస రేటు, రక్తపోటు తగ్గుతాయని పేర్కొంటున్నారు. ఇవి శరీరానికి విశ్రాంతిని అందించి, ఒత్తిడి సంబంధిత అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుందని తెలిపారు. అంతేకాకుండా ఇబ్బంది కలిగించే భావోద్వేగాలను వెలిబుచ్చటానికి సహకరించటంతో పాటు మూడ్‌ని నియంత్రిస్తుందని వివరిస్తున్నారు. సంగీతం మానసిక స్థితి, శ్రేయస్సును పెంచుతుందని, కొన్ని ఆరోగ్య పరిస్థితులకు చికిత్సల సమయంలో సంగీత చికిత్స సహాయపడుతుందని Harvard Health Publishing అధ్యయనంలో పేర్కొంది.