• ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల పంచాయితీ
  • కేవలం బనకచర్ల మీదనే స్టడీ చేయాలంటున్న ఏపీ
  • జలవివాదాలను పరిష్కరించాలంటున్న తెలంగాణ
  • ఎటూ తేల్చని కేంద్రం..!

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలు (Telugu states) విడిపోయి దశాబ్ద కాలం దాటినా.. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు మాత్రం ఇంకా ఓ కొలి రావడం లేదు. ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న జగడాలకు ఇక చెక్ పడుతుందని అంతా భావించారు. ఈ వివాదానికి ఉపశమనం కలిగించాలని ఇటీవల కేంద్రం (center) ఇరురాష్ట్రాల సీఎంలతో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ మేరకు ఓ కమిటీని ప్రతిపాదించింది. అయితే ఆ కమిటీ ఏర్పాటు ఉత్తదేనని మరోసారి వెల్లడైంది. కానీ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం (Consensus) కుదరకపోవడం, పెద్దన్న పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపించడం లేదని స్పష్టమవుతున్నది.

కేంద్రం నాన్చివేత ధోరణి..

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు పరిష్కారం చూపాలని గతనెల 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil) అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి (Revanth Reddy), చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హాజరయ్యారు. వారితో పాటే ఇరురాష్ట్రాల నీటిపారుదల శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై అందరి సమక్షంలో సుదీర్ఘంగా చర్చించారు. వాటిని పరిష్కరిం చేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భావించారు. మొత్తం 12మంది సభ్యులతో ఈ కమిటీని నియమించాలని భావించారు. ఇరురాష్ట్రాల కు చెందిన ఐదుగురు నిపుణుల (Five experts) చొప్పున ఎంపికచేసి కేంద్రానికి జాబితా పంపించాలని సూచించారు. కేంద్రం నుంచి ఇద్దరిని ఇందులో పొందుపరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్ప టికీ నెలరోజులు గడుస్తున్నా కమిటీ గురించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

అసలు కారణాలివే..
ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల నేతృత్వంలో కేంద్ర జలశక్తి (Central Hydropower) ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంతవరకూ కమిటీ ఏర్పాటుకాలేదు. అయితే.. ఇందుకు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలే కారణమని తెలిసింది. ఈ కమిటీ పరిధిని కేవలం గోదావరిపై తాము నిర్మిస్తున్న బనకచర్ల (Banakacharla) పై స్టడీ కోసం వరకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం గట్టిగా వాదిస్తున్నది. రాయలసీమకు తాగునీటి అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్టుల (projects) పై తెలంగాణ అనవసర రాద్దాంతం చేస్తు న్నదని, ముందు ఆ సమస్యను పరిష్కరించాలని ఏపీ కోరుతూ సమావేశంలో నిర్ణయించారు. కమిటీ సభ్యుల కోసం పేర్లను సూచిం చాలని ఇరురాష్ట్రాలను ఇప్పటివరకు కేంద్రం పెద్దగా ఫాలోఅప్ చేసింది లేదు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చి, కమిటీ (Committee) పరిధిపై ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలకు పరిష్కారం చూపేలా కమిటీ పనిచేయాలని డిమాండ్ చేస్తున్నది. అసలు బనకచర్ల అంశాన్నే చర్చకు తీసుకురావద్దని వాదిస్తున్నది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి కృష్ణా, గోదావరి (Krishna, Godavari) నదులపై ఉన్న అన్ని వివాదాలను ఈ కమిటీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నది. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (Pothireddypadu Head Regulator) సామర్థ్యం పెంపు, కృష్ణా జలాల్లో వాటాలపైనే కమిటీ పనిచేయాలని కోరుతున్నది. ఇందుకు ఏపీ ప్రభుత్వం సమ్మతించడం లేదు. అందుకే కమిటీ ఏర్పాటు ఇక అటకెక్కినట్లేనన్న వాదన వినిపిస్తున్నది.

Leave a Reply