( ఆంధ్రప్రభ, ఏ కొండూరు ) : సుసంప‌న్న‌, ఆరోగ్య‌, ఆనంద ఆంధ్ర సాకారానికి గిరిజ‌నుల స‌మ‌గ్రాభివృద్ధి కూడా కీల‌క‌మ‌ని.. ఆదివాసీల సాధికార‌త‌కు ప్ర‌త్యేక ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని, వీటిని స‌ద్వినియోగం చేసుకొని అన్ని విధాలా ఉన్న‌తంగా ఎద‌గాల‌ని శాస‌న‌స‌భ్యుడు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు (KolikapudiSrinivasRao), జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు.

జిల్లా గిరిజ‌న సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో శాస‌న‌స‌భ్యుడు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు అధ్య‌క్ష‌త‌న శ‌నివారం ఎ.కొండూరులోని గిరిజ‌న సంక్షేమ బాలుర ఆశ్ర‌మ ఉన్న‌త పాఠ‌శాలలో ప్ర‌పంచ ఆదివాసి దినోత్స‌వ వేడుక‌లు జ‌రిగాయి. తొలుత ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ (LakshmiSha).. అధికారులు, గిరిజ‌న నాయ‌కుల‌తో క‌లిసి మ‌హ‌నీయులు సేవాలాల్ మ‌హ‌రాజ్‌, ఏక‌ల‌వ్యుడు, డా.బీఆర్ అంబేద్క‌ర్‌, వెన్నెల‌గంటి రాఘ‌వ‌య్య‌, అల్లూరి సీతారామ‌రాజు, చెంచుల‌క్ష్మి త‌దిత‌రుల‌కు ఘ‌న నివాళులర్పించారు. వేడుక‌ల్లో గిరిజ‌న సంప్ర‌దాయ క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు అల‌రించాయి.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ… 50శాతానికి పైగా గిరిజ‌న జ‌నాభా ఉన్న ప్రాంతాల్లో ఐటీడీఏల ద్వారా విశేష కృషి జ‌రుగుతోంద‌ని.. ఎస్‌టీ స‌బ్ ప్లాన్ (ST Sub Plan) అమ‌లుతో పాటు వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల అమ‌ల్లోనూ ప్ర‌త్యేక అధికార యంత్రాంగం ప‌నిచేస్తోంద‌న్నారు. మౌలిక వ‌స‌తుల అభివృద్ధిపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. గిరిజ‌న విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు ఆశ్ర‌మ పాఠ‌శాల‌లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని.. వీటిలో చ‌దువుకొని ఎంద‌రో గొప్ప‌వార‌య్యార‌న్నారు. స్వ‌ర్ణాంధ్ర @ 2047లో భాగంగా ఎమ్మెల్యే నేతృత్వంలో నియోజ‌క‌వ‌ర్గాల దార్శ‌నిక ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌డం జ‌రిగింద‌ని, గిరిజ‌నుల త‌ల‌స‌రి ఆదాయాన్ని పెంచేందుకు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు.

గిరిజ‌నులు ఆకాశ‌మే హ‌ద్దుగా ఎద‌గాలి….
గిరిజనుల సంక్షేమాన్ని (TribalWelfare) దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు చదువుకునేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివాసీలు తమ పిల్లలను బాగా చదివించుకొని, వెనుకబాటుతనం నుండి బయటపడి నాగరిక సమాజంతో పోటీపడి ఆకాశమే హద్దుగా ఎదగాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ యువత, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, అదేవిధంగా తండాల పెద్దలు తమ పిల్లల చదువులపై దృష్టిపెట్టి మంచి దారిలో న‌డిపించాల‌న్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగాల (Constable jobs) లో తిరువూరు నియోజవర్గం నుండి 37 మంది ఎంపికయ్యారని వారిలో గిరిజన యువకులు ఉన్నారన్నారు. ఈనెల 22న తిరువూరులో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నామని, 500 మందికి పైగా యువతకు ఉద్యోగాలు కల్పించే జాబ్ మేళాను పదోతరగతి నుండి ఇంటర్, డిగ్రీ వ‌ర‌కు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వేడుక‌ల్లో జిల్లా గిరిజ‌న సంక్షేమ అధికారి ఎ.విజ‌య‌శాంతి, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, మాదిక కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ వాసం మునియ్య, విద్యావేత్త బి.జ్యోతిలాల్ నాయ‌క్‌, జెడ్‌పీటీసీ భుక్యా గ‌న్యా, స్థానిక గిరిజ‌న నాయ‌కులు, స్థానిక ప్ర‌జాప్రతినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply