జన్నారం, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా పొనకల్ను కేంద్రంగా చేసుకొని నడిపిన అంతర్జాతీయ సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులో మరో నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో విజయనగరం జిల్లా కోమరాడ మండలంలోని సీతమాంబపురం వాసి బోను జయవర్ధన్, అదే జిల్లాలోని బొబ్బిలి మండలం కోమటిపల్లివాసి, జియో సిమ్ సేల్స్‌మెన్ మోతి సింహాద్రి, పార్వతీపురం జిల్లా పార్వతిపురం గ్రామానికి చెందిన ఎయిర్టెల్ ప్రమోటర్ పోటనూరి జగదీష్, మన్యం పార్వతీపురం జిల్లా సీతానగరం మండలంలోని ఇప్పలవలస గ్రామానికి చెందిన ఎయిర్టెల్ ప్రమోటర్ లక్కోజి తేజ లను శుక్రవారం సాయంత్రం పొనకల్ కేంద్రముగా నడిపిన అంతర్జాతీయ సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ సెటప్ కేసులో అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు మంచిర్యాల ఎసీపీ ఆర్.ప్రకాష్ తెలిపారు
ఇక, ఈ కేసులో కీలక నిందితులు అయిన పాలవలసల సాయి కృష్ణ అలియాస్ జాక్ అలియాస్ రాజు (కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం, వేదాంతపురం గ్రామం), పిసినిక సంతోష్ (విజయనగరం జిల్లా కోమరాడ మండలం, సీతమ్మపురం గ్రామం) ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు.
గత నెల 30న ఇదే కేసులో గొట్ల రాజేష్ యాదవ్, యాండ్రపు కామేష్, బావు బాపయ్య, బావు మధుకర్లలను అరెస్ట్ చేశారు. అలాగే, హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీసులు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని 5 రోజుల క్రితం చర్లపల్లి జైలుకు పంపించారు.
ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లను చాకచక్యంగా పట్టుకున్న లక్షేట్టిపేట సీఐ డి.రమణమూర్తి, ఎస్సై గొల్లపల్లి అనూష, లక్షేట్టిపేట, దండేపల్లి ఎస్సైలు గోపతి సురేష్, ఎం.డి. తహసోద్దీన్ లను రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్ అభినందించారు.