బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department issues alert) హెచ్చరించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (Telangana) లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న (సోమవారం) హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఈ రోజు కూడా హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసిన వాతావరణ శాఖ రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది. ద్రోణి ప్రభావం మరింత పెరిగితే ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో పాటు, ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Officials of Meteorological Department) తెలిపింది.
ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.