నాణ్యమైన విద్యే.. ప్రభుత్వ లక్ష్యం : కలెక్టర్ చేతన్

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 4 (ఆంధ్రప్రభ): విద్యార్ధుల సమగ్రవికాసానికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ (Collector) టి.ఎస్.చేతన్ (T.S.Chetan) అన్నారు. సోమవారం పెనుకొండ నియోజకవర్గం పాల సముద్రం సమీపంలో గల మాదక ద్రవ్యాలు, కస్టమ్స్ , పరోక్ష పన్నుల జాతీయ అకాడమీ (National Academy of Narcotics, Customs and Indirect Taxes) (నసిన్ – నేషనల్ అౠ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నుల నార్కోటిక్స్) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయం (Central Vidyalayam) లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 2025 -26 విద్యా సంవత్సరానికి తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ ముఖ్య అతిథిగా హాజరై తరగతులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు (Rural areas students) నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసిందన్నారు. తెలుగు (Telugu), ఇంగ్లీష్ (English), హిందీ (Hindi) మాధ్యమ విద్యార్థులకు మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా భాషాపరంగా, అభ్యాసపరంగా వారిని సమానంగా తీర్చిదిద్దే ప్రయత్నం కొనసాగుతోందన్నారు.

మన ప్రాంతానికి ప్రత్యేకించి నాణ్యమైన ఇంగ్లీష్ విద్య అవసరం ఉంది. గ్లోబల్ స్థాయి (Global level) లో ఎదగాలంటే భాషా సామర్థ్యం తప్పనిసరి. అయితే, అదే సమయంలో తమ మాతృభాష తెలుగు మీద గౌరవం కోల్పోకుండా, రెండు భాషల్లోనూ చక్కటి ప్రావీణ్యం పెంపొందించేందుకు పాఠశాలలోని అధ్యాపకులు కృషి చేయాలన్నారు.

ఇందుకు పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌ల (Parent-Teacher Meetings) ద్వారా తల్లిదండ్రులు, బోధన సిబ్బంది మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారి శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో సమాజం మొత్తం భాగస్వామిగా ఉండాలని కలెక్టర్ (Collector) సూచించారు. గతంలో జాతీయ రహదారి పక్కన కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించామని, అయితే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాసిన్ వెనుక వైపు భూమిని కేటాయించి, ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేశామన్నారు. అయినప్పటికీ హైవే ప‌క్కన ఉండే విద్యా సంస్థల కోసం భద్రతా చర్యలు (Security measures) తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

విద్యతో పాటు వారికి ఇష్టమైన క్రీడల్లో రాణించడానికి ఉపాధ్యాయులు (Teachers), తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. క్రీడలు విద్యార్థుల ఆరోగ్యానికి దోహదపడుతాయన్నారు. పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉంటుందో,ఇంటి వద్ద తల్లిదండ్రుల పాత్ర అంతే ఉంటుందన్నారు. ముందుగా జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నాసిన్ జాయింట్ డైరెక్టర్ డి.సత్య దివ్య రమ్య, డిప్యూటీ డైరెక్టర్ ఈ.శేషు, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బి.కృష్ణా రావు, గోరంట్ల తహశీల్దార్ మారుతి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply