కర్ణాటక రాష్ట్రం (Karnataka State)లోని ప్రముఖ క్షేత్రమైన ‘ధర్మస్థల’ (Dharmasthala) ప్రాంతం ఇటీవల వార్తల్లో నిలిచింది. రెండు దశాబ్దాల్లో అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని ఓ రిటైర్డ్ ఉద్యోగి (Retired employee) ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలనం రేపింది. అవన్నీ అనుమానాస్పద రీతిలో.. లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ నెల 3న న్యాయవాదితో కలిసి అక్కడి పీఎస్ కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడి (Sanitation worker) గా పని చేసిన తాను దాదాపు 20ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టానని చెప్పడంతో సంచలనంగా మారింది. ప్రస్తుతం మానవహక్కుల, మహిళ సంఘాలు నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team) (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా అప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదని.. ఒకవేళ ఈ ఘటనను గుర్తించినా చూసీ చూడనట్టు వ్యవహరించిందా.. అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అప్పుడున్న ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్పిన అవసరం ఉందని దేశంలోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

‘సిట్’ కోసం సీఎంపై ఒత్తిడి..
ఈ కేసు విచారణ, దర్యాప్తు (Investigate) లో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని పలు న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ.. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి (Supreme Court Retired Judge) జస్టిస్ వి.గోపాలగౌడ నేతృత్వంలోని బృందం సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ను కలిసి విజ్ఞప్తి చేసింది. ధర్మస్థల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, దీనిపై నిష్పక్షపాత దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయాలని కర్ణాటక మహిళా కమిషన్ ముఖ్యమంత్రిని కోరింది.
మిస్టరీగా పలు కేసులు..?
2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ (Ananya Bhatt) కనిపించకుండా పోయింది. ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో.. తన కుమార్తె మిస్సింగ్ కేసు (Missing case) ను దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి సుజాత భట్ (Sujata Bhatt) (60) దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం- హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుతూ పౌర సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కొంత కాలంగా ఆందోళనలను ఉద్ధృతం చేశాయి.

సంచలన వీడియో..
ఈ క్రమంలోనే ‘అక్కడ వరుస హత్యలకు కారకులు ఎవరు?’ అని ప్రశ్నిస్తూ ఓ యూట్యూబర్ (YouTuber) చేసిన వీడియో ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోసింది. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా ఏఐ (A.I) సాయంతో ఆ వీడియో రూపొందించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు (police).. అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్నారనే అభియోగాలపై ఆ యూట్యూబర్‌పై కేసు నమోదు చేశారు. అయితే, ఇప్పటికే ఆ వీడియోకు 50 లక్షలకుపైగా వ్యూస్ రావడం గమనార్హం.