TG | కవ్వాల్ రిజర్వ్ లో రణరంగం – ఫారెస్ట్ సిబ్బందిపై తిరగబడ్డ ఆదివాసీలు

ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని ఇచ్చోడ మండలం సిరిచెల్మ అటవీ ప్రాంతంలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. అటవీశాఖ అధికారులు, సిబ్బంది అడవుల సంరక్షణ పేరిట పోడు భూముల్లో ప్లాంటేషన్ చేసేందుకు వెళ్లగా కేశవపట్నం గ్రామానికి చెందిన మహిళలు, ముల్తానీలు 50 మంది తిరగబ‌డ్డారు. పత్తి పంట నాటిన మొక్కలను ధ్వంసం చేసి అటవీ సిబ్బంది, పోలీసుల‌పై రాళ్ల దాడికి తెగ‌బ‌డ్డారు.

ఎస్ఐతోపాటు తొమ్మిది మందికి గాయాల‌య్యాయి. పోలీసు వాహ‌నం కూడా ధ్వంస‌మైంది. ఉద్రిక‌త్త‌తో చోటుచేసుకోవ‌డంతో భారీగా పోలీసు బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఆ ప్రాంత‌మంతా ర‌ణ‌రంగంగా మారింది.

వారం రోజులుగా…సిరిచెల్మ ఘాట్, జోగిపేట, చెలకగూడ, కేశవపట్నం అటవీ ప్రాంతంలోని 172, 174 కంపార్ట్మెంట్ పరిధిలో మొక్కలు నాటేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 18న జియో టాగింగ్ సర్వే చేసి 19 న పోడు భూముల్లో రైతులు సాగు చేసిన పత్తి మొక్కలు తొలగించిన అట‌వీ సిబ్బంది మొక్కలు నాటేందుకు ప్రయత్నించగా కొడ‌వ‌ళ్ల‌తో నిర‌స‌న చేప‌ట్టారు. గొంతు కోసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. తమ పంట భూములకు పట్టాలు ఇవ్వకపోగా పోలీసులు అటవీ సిబ్బంది కలిసి ప్లాంటేషన్ పేరిట భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్ప‌ట్లో అడ్డుకున్న ఎనిమిది మందిని పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. అటవీ సిబ్బంది వర్సెస్ ముల్తానీలు చెలకగూడ – సిరిచేల్మా, సడక్ గూడ, కేశవపట్నం ప్రాంతాల్లో ఆదివారం ఉదయం సుమారు 100 మంది పోలీసుల‌తో అటవీ సిబ్బంది ప్లాంటేష‌న్ చేసేందుకు పకడ్బందీగా వెళ్లారు. పోలీసులు, అటవీ అధికారులపై ముల్తానీలు, మహిళలు రాళ్ల దాడి చేయగా ఫారెస్ట్ సిబ్బంది వెనక్కి పరుగులు తీశారు.

అయితే పోలీసులు ముందుకు వెళ్లారు. అటవీ శాఖ , పోలీస్ శాఖ సిబ్బంది పై కర్రలు, రాళ్ల తో ఎదురుదాడి చేయడంతో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. కవ్వాల్ రిజర్వ్ పరిధి రణరంగం తలపించింది. ఈ దాడిలో ఇచ్చోడ ఎస్సై పురుషోత్తం చేతికి గాయం కాగా మరో ఇద్దరు పోలీసుల తలకు గాయాల‌య్యాయి. వెంటనే వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫారెస్ట్ పోలీస్ శాఖకు చెందిన పోలీసు‌ వాహనాలు ధ్వంసమ‌య్యాయి.

గాయాల పాలైన ఫారెస్ట్ సిబ్బందికి ఇచ్చోడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యాహ్నం వరకు ఇచ్చోడా మండలం సిరి చెల్మ అటవీ ప్రాంతంలోనీ పలు గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హుటాహుటిన పోలీసు బలగాలతో అక్కడికి చేరుకొని ప‌రిస్థితిని అదుపు చేశారు.

Leave a Reply