భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ అద్భుతమైన ప్రదర్శనతో కెనడా ఓపెన్ 2025 సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించాడు. అతను చైనీస్ తైపీకి చెందిన ప్రపంచ ఆరో నంబర్, టాప్ సీడ్ చౌ టియెన్ చెన్‌ను క్వార్టర్ ఫైనల్స్‌లో, 21-18, 21-9 స్కోరుతో సులభంగా ఓడించాడు. ఈ విజయం కేవలం 43 నిమిషాల్లోనే రావడం గమనార్హం.
చౌపై మ్యాచ్ ప్రారంభం నుంచే శ్రీకాంత్ దూకుడు చూపించాడు. తొలి గేమ్‌లో 5-0 లీడ్‌తో మొదలుపెట్టి, 16-16 వద్ద సమం అయినా, చివర్లో 5 పాయింట్లు దక్కించుకుని 21-18తో గేమ్‌ని గెల్చేశాడు.
ఈరోజు జరిగే సెమీఫైనల్లో శ్రీకాంత్ జపాన్‌కు చెందిన మూడో సీడ్ కెంటా నిషిమోటోతో తలపడనున్నాడు. ఇప్పటివరకు వారి మధ్య జరిగిన 10 మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 6 విజయాలతో ముందంజలో ఉన్నాడు.
ఇతర భారత క్రీడాకారుల విషయానికొస్తే, యువ షట్లర్ ఎస్.శంకర్ ముత్తుసామి 79 నిమిషాల కఠినమైన మ్యాచ్‌లో నిషిమోటో చేతిలో 15-21, 21-5, 17-21 తేడాతో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో శ్రీయాన్షి వాలిశెట్టి డెన్మార్క్‌కు చెందిన అమాలీ షుల్జ్ చేతిలో ఓడిపోయింది.
ఈ విజయంతో కెనడా ఓపెన్‌లో మిగిలిన ఏకైక భారత ప్రతినిధిగా శ్రీకాంత్ కొనసాగుతున్నాడు.