రాయపూర్, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ (chattisgarh ) రాష్ట్రం బీజాపూర్ జిల్లా (Bijapur district ) ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో శనివారం తెల్లవారు జామున భద్రతా దళాలు, (security personals ) మావోయిస్టుల (Maoists ) మధ్య ఎదురు కాల్పులు (encounter ) చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. మరి కొందరు గాయపడ్డారని పోలీసులు అనుమానిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. అదపాదడపాగా కాల్పులు జరుగుతున్నాయి. ఇంకా మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఆపరేషన్ కగార్ దూకుడు…
మావోయిస్టుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ దూకుడు మళ్లీ పెంచింది. గతంలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు వర్షా కాలంలో నిలిపివేసేవారు. పెద్ద ఎత్తున నదులు, వాగులు, వంకలు పొంగడంతో అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఇబ్బందిగా మారుతుంది. ఈ క్రమంలో వర్షాకాలం నక్సలైట్లకు అనుకూల వాతావరణంగా భావించవచ్చు. కేంద్రహోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ సభలో వర్షాకాలంలోనూ మావోయిస్టులను నిదరపోయినీయమని ప్రకటించిన సంగతి విదితమే. దీంతో భద్రతా దళాలు ఆపరేషన్ కగార్ దూకుడు పెంచింది.
ఎన్‌కౌంటర్ జరిగిందిలా…
ఇంద్రావతి నదిలో పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంద్రావతి నేషనల్ పార్క్‌కు మావోయిస్టులు మాటు వేస్తారని భద్రతా దళాలు భావించాయి. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాలకు చెందిన డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్ బలగాలు పెద్ద ఎత్తున ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. శుక్రవారం రాత్రి నుంచి అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున మావోయిస్టులు ఎదురు పడడ్డంతో వారి మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు.