అహ్మాదాబాద్ : బీర్ మగ్ చేతిలో పట్టుకొని, బీర్ తాగుతూ క్లయింట్ తరఫున వర్చువల్‌గా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదిపై చర్యలకు రంగం సిద్ధమైంది. గత నెల 25న గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) న్యాయమూర్తి జస్టిస్ సందీప్ భట్ బెంచ్ ఎదుట దారుణంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించిన న్యాయవాది భాస్కర్ తన్నా వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది.
న్యాయస్థానాల గౌరవ ప్రతిష్టతను కాపాడేందుకు, సమన్యాయ భావనను పరిరక్షించేందుకు ఈ అంశాన్ని సుమోటో గా విచారణకు స్వీకరిస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎస్.సుపేహియా, జస్టిస్ ఆర్.టి.వచ్చానీలతో కూడిన డివిజన్ బెంచ్ వెల్లడించింది. ఒకవేళ ఈ అంశాన్ని తాము విస్మరించినా, పట్టించుకోకుండా వదిలేసినా సమ న్యాయ భావనకు విఘాతం కలుగుతుందని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి న్యాయవాది ప్రవర్తనను ఉపేక్షిస్తే భవిష్యత్తులో న్యాయ విచారణ వ్యవస్థ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి రావచ్చని తెలిపింది.
‘సీనియర్ న్యాయవాది హోదాకు అర్హులు కారు’
కేసు వర్చువల్ విచారణ సందర్భంగా న్యాయవాది భాస్కర్ తన్నా (Bhaskar Tanna) ఫోన్‌లో మాట్లాడుతూ… బీర్ తాగుతూ వాదనలు వినిపించిన తీరు కోర్టును ధిక్కరించినట్లుగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ (Video clip) సోషల్ మీడియాలోనూ వైరల్ అయిందని న్యాయమూర్తి జస్టిస్ సుపేహియా తెలిపారు. భాస్కర్ తన్నాకు ఇక సీనియర్ న్యాయవాది హోదాను కలిగి ఉండే అర్హత లేదన్నారు. తదుపరిగా జరిగే విచారణలో దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని వెల్లడించారు. భాస్కర్ తన్నాపై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదుకు రిజిస్ట్రీకి హైకోర్టు డివిజన్ బెంచ్ (High Court Division Bench) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల తర్వాత దీనిపై వాదనలు వింటామని, ఆలోగా వర్చువల్ విచారణ వేళ భాస్కర్ తన్నా ప్రవర్తనా శైలిపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని రిజిస్ట్రీకి ధర్మాసనం నిర్దేశించింది.
వర్చువల్ వాదనలు వినిపించకుండా బ్యాన్…
ఈ నేపథ్యంలో న్యాయవాది భాస్కర్ తన్నాకు హైకోర్టు నోటీసులు (Notices) జారీ చేసింది. వర్చువల్ విచారణ వేళ అభ్యంతరకర ప్రవర్తనపై వివరణ కోరింది. న్యాయస్థానాల వర్చువల్ బెంచ్‌ల ఎదుట వాదనలు వినిపించకుండా ఆయనపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.