- సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది
- ప్రభాకర్ రావుకు అమాయకుల ఉసురు తగులుతుంది
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఆంధ్రప్రభ : ఫోన్ టాపింగ్ (Phone Tapping) తో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక మంది జీవితాలను నాశనం చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ఆరోపించారు. శనివారం కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్ష నాయకులతో పాటు సొంత పార్టీ నాయకుల ఫోన్ నెంబర్లు సైతం ట్యాపింగ్ చేయించిన చేసిన దుర్మార్గుడన్నారు. దీనివెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసముని, అనేక మంది ఉసురు పోసుకున్న దుర్మార్గుడు ప్రభాకర్ రావు అన్నారు. నాతోసహా బీజేపీ నేతలందరి ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ తోపాటు జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికార్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, అనుమానం పుట్టినంకే కేసీఆర్ పుట్టారన్నారు. అందుకే సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు.
జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, గతంలో కాంగ్రెస్ (Congress) కూడా ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారని అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సిబిఐ విచారణ కోరడం లేదన్నారు. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఏసీబీ రాధాకిషన్ రావు వాంగ్మూలమిచ్చినా కేసీఆర్ కు ఎందుకు నోటీసులివ్వలేదన్నారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు నోటీసులివ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారని, మీ ఇద్దరి మధ్యనున్న రహస్య ఒప్పందమేంటన్నారు. నాపై కేసీఆర్ ప్రభుత్వం 109కేసులు పెట్టిందని, సీఎం ఆఫీస్ ను అడ్డాగా చేసుకుని మేం ఫోన్ లో మాట్లాడుకునే విషయాలన్నీ విన్న నీచుడు ప్రభాకర్ రావు అన్నారు. ప్రభాకర్ రావుకు రాచ మర్యాదలు ఇవ్వడం ప్రభుత్వం మానుకోవాలన్నారు.
ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని నేను 100 సార్లు చెప్పానన్నారు. టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చిన పోలీసులు నేను నైట్ డ్రస్ తో ఉన్నానని తెలిసినా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే నన్ను అరెస్ట్ చేశారన్నారు. ప్రభాకర్ రావుతో పోలీసులు ఇదే విషయంపై ఫోన్ లో మాట్లాడుతుంటే స్వయంగా నేనే విన్నానన్నారు.
కేసీఆర్ పాలనలో మీడియాసహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారు..
జర్నలిస్టులు సైతం వాట్సాప్, ఫేస్ టైం, సిగ్నల్ ద్వారా మాట్లాడుకునే దుస్థితి తీసుకొచ్చారన్నారు. వాట్సాప్ కాల్ ను కూడా ట్యాప్ చేసిన మూర్ఖుడు ప్రభాకర్ రావు అన్నారు. కాంగ్రెస్, బిజెపి ప్రజా ప్రతినిధులు నాయకులతో పాటు అధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు.
కేసీఆర్, కేటీఆర్ లను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరింది, అందుకే కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులివ్వడం లేదు. ప్రభాకర్ రావు అమెరికా నుండి ఇండియాకు వచ్చే ముందే కేటీఆర్ యూఎస్ వెళ్లింది నిజం కాదా. కేటీఆర్ అమెరికా వెళ్లిన తరువాతే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి సరెండర్ అయ్యారు.
బీఆర్ఎస్ ను గద్దె దించింది బీజేపీ పార్టీయే..
కేసీఆర్ మెడలు వంచేలా పోరాటాలు చేసిందే బీజేపీ. బీఆర్ఎస్ (BRS) తో అండర్ స్టాండింగ్ ఉంటే ఎందుకు పోరాటాలు చేస్తాం. కాంగ్రెస్ గులాబీ పార్టీ మాదే ఒప్పందం కోరడం వల్లే కేసీఆర్ కేటీఆర్ లకు నోటీసులు ఇవ్వడం లేదన్నారు.
ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణకు మేం సిద్ధం…
కేంద్రం నేరుగా సీబీఐ విచారణ జరిపే అవకాశం లేదు. లేకుంటే ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ నిందితులందరినీ గుంజుకుపోయి చట్ట ప్రకారం బొక్కలో వేసే వాళ్లం. ప్రభాకర్ రావు తో పాటు కేసీఆర్ కుటుంబాన్ని గల్లా పట్టి ఈడ్చుకు వెళ్లి బొక్కలో పెట్టేవాళ్ళమని బండి సంజయ్ అన్నారు.