TG | కాంగ్రెస్ చేసింది గోరంత, చెప్పకునేది కొండంత : హ‌రీష్ రావు

  • నిర్ణీత కాల వ్యవధి అంటే ఎప్పుడో కూడా చెప్పాలి
  • కాంగ్రెస్ పాపం రైతన్నలకు శాపంగా మారింది
  • కోతల కాలం వచ్చినా రైతు భరోసా వస్తుందో లేదో తెలియని పరిస్థితి
  • రైతన్నల చావులు నిత్యకృత్యం అవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు.

రైతుల భరోసా విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది గోరంత, చెప్పకునేది కొండంత అన్న‌ట్టు ఉంద‌ని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతులందరికీ ఎకరాకు 7,500 రైతు భరోసా అని, దాన్ని ఎకరాకు 6వేలకు కుదించార‌ని, ఇప్పుడు ఎకరంలోపున్న రైతులకు మాత్రమే రైతు భరోసా డ‌బ్బులు అకౌంట్లో వేసి… ఇచ్చిన మాట మీద నిలబడ్డట్లు కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంద‌ని మండిప‌డ్డారు.

రాష్ట్రంలో 68లక్షల మంది రైతులుంటే, 21,45,330 మందికి రైతు భరోసా వేసినట్లు చెప్పుకుంటున్నరు. మరి మిగతా 47లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ‘‘2023 వానాకాలానికి సంబంధించి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం లోపు ఉన్న రైతు సంఖ్య 22,55,181 గా గుర్తించి, రైతు బంధు అందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 21,45,330 మందిగా గుర్తించింది. అంటే 1,09,851 మంది రైతులకు కోత విధించింది.

లక్ష పైగా రైతులకు ఎందుకు రైతు భరోసా లేకుండా చేసారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న నిర్ణీత కాల వ్యవధి అంటే ఎప్పుడో కూడా చెప్పాలి అన్నారు.

ఇప్పుడు తీసుకుంటే 10వేలు, 2023 డిసెంబర్ 9 నాడు తీసుకుంటే రైతు భరోసా 15వేలు అన్నరు. అధికారంలోకి రాగానే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి, రైతన్నకు భరోసా లేకుండా చేసారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తమన్నారు, మాట మార్చి 26, జనవరికి అన్నరు. అది కూడా కాదని మార్చి 31 వరకు ఇస్తమని ప్రకటించారు.

నాట్లు వేసే కంటే ముందే కేసీఆర్ పంట పెట్టుబడి సాయంగా రైతు బంధు అందిస్తే, కాంగ్రెస్ పాలనలో కోతల కాలం వచ్చినా రైతు భరోసా వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ప్రభుత్వానికి లబ్ధిదారుల్లో కోతలు విధించడంపై ఉన్న దృష్టి, రైతులు, పేదల సంక్షేమం పట్ల ఏమాత్రం లేదు.

కాంగ్రెస్ పాపం రైతన్నలకు శాపంగా మారింది. 14నెలల పాలనలో 415పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతు భరోసా రాలేదని ఒకరు, అప్పు కట్టలేదని ఇంకొకరు, బ్యాంకుల వేధింపులు భరించలేక మరొకరు.. ఇలా రాష్ట్రంలో రైతన్నల చావులు నిత్యకృత్యం అవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు.

ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ, రైతు భరోసా ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నది. 2023 యాసంగిలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 2,500, 2024 వానాకాలంలో ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7,500. ఈ యాసంగికి ఒక్కో ఎకరానికి ఇవ్వాల్సిన 7,500 కలుపుకొని మొత్తం ఒక్కో రైతుకు ఎకరానికి 17,500 చొప్పున బాకీ పడింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఈ బాకీని ఇంకెప్పుడు తీర్చుతారు. లబ్ధిదారుల జాబితాలో కోత విధించిన లక్ష మంది రైతులతో పాటు, మిగతా రైతులందరికీ వెంటనే రైతు భరోసా సాయం అందించాలని’’ బీఆర్ఎస్ పక్షాన హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *