బెంగళూరు – తమిళ స్టార్ కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కమల్ వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్య్ర హక్కను ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ఉపయోగించొద్దంటూ హెచ్చరించింది.
ఈ వివాదం నేపథ్యంలో కమల్ హాసన్ తాజా చిత్రం ‘థగ్‌లైఫ్’ ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కమల్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన రాబోయే చిత్రం థగ్ లైఫ్‌ను రాష్ట్రంలో విడుదల చేసి ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా కమల్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వచ్చారా..?’ అంటూ తీవ్రంగా మండిపడింది.
‘మీరు కమల్ హాసన్ కావొచ్చు.. ఎంత పెద్ద నటుడైనా కావొచ్చు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు మీకు లేదు. ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు. మీ కామెంట్స్ వల్ల అశాంతి ఏర్పడింది. నీరు, భూమి, భాష.. ఇవి ప్రజలకు ముఖ్యమైనవి. ఈ దేశ విభజన భాషా ప్రాతిపదికన జరిగింది. ఏ భాష మరొక భాష నుంచి పుట్టదు. మీ వ్యాఖ్యలతో కర్ణాటక ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. మీరేమైనా చరిత్రకారుడా? లేక భాషావేత్తనా..? ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు..? కన్నడ ప్రజలు మిమ్మల్ని ఏమి అడిగారు..? కేవలం క్షమాపణలే కద. ఈ వ్యవహారంలో ఒక్క క్షమాపణ చెబితే సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది’ అని న్యాయమూర్తి నాగప్రసన్న వ్యాఖ్యానించారు. కమల్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది కోర్టు.