కాళేశ్వరం – సరస్వతి పుష్కరాల సందర్బంగా గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతి కలయికతో ప్రఖ్యాతిగాంచిన త్రివేణి సంగమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు పుణ్యస్నానం చేశారు. అనంతరం ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కారాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పుష్కర పండగకు విడుదల చేసిన 35 కోట్ల రూపాయలు ఏర్పాట్లకు సరిపోవన్నారు. యూపీ రాష్ట్రంలో కుంభమేళా కు 50 కోట్ల మందికి బీజేపీ ప్రభుత్వం సరిపడ నిధులు విడుదల చేసి ఘనంగా నిర్వహించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పుష్కరాలను కుంభమేళ తరహాలో కోట్లాది మందిని తరలించి ఘనంగా నిర్వహించే వాళ్ళమని చెప్పారు. అందాల పోటీలకు రూ. 300 కోట్లు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు రూ. 35 కోట్లు వెచ్చించడం ఏంటి? అని ప్రశ్నించారు.
పుష్కరాలను ఈ ప్రాంతానికి పరిమితి చేయడం పద్ధతి కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వచ్చే పుష్కరాలకు ఎక్కువ బడ్జెట్ విడుదల చేసి ఘనంగా నిర్వహించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంతో కాళేశ్వరానికి చెడ్డపేరు వచ్చిందని.. పుష్కరాలతోనైన మంచి పేరు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ముక్తీశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం కోట్లు వెచ్చించిన నిధులు విడుదల చేయలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన రూ. 200 కోట్ల హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.