సముద్రంలోకి వృధాగా వెళ్తున్న మున్నేరు వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు మళ్లించడానికి మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.162.54 కోట్లు విడుదల చేసింది. ఇందుకోసం జీవో 98ని విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
వృధాగా పోతున్న వరద నీటిలో దాదాపు 10 టిఎంసిల వరద నీటిని పాలేరు రిజర్వాయర్ కు మళ్లించవచ్చని ఆయన అన్నారు. దీనితో ఈ జలాశయం పరిధిలో 2.54 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని, అందులో 1.30 లక్షల ఎకరాలు పాలేరు నియోజకవర్గంలోనే స్థిరీకరణ జరుగుతుందని మంత్రి అన్నారు.
సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు తాగునీరు, డోర్నకల్ నియోజకవర్గంలోని పది చెరువులకు సాగునీరు అందించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
పాలేరు లింక్ కెనాల్‌కు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇరిగేషన్ శాఖ మంత్రిఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.