ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ స్టాక్ మార్కెట్లు ఇవాళ ట్రేడింగ్‌లో డ్రాప్ అయ్యాయి. సోమవారం రాకెట్‌లా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ ఉదయం పేలవంగా స్టార్ట్ చేశాయి. సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్ల నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ గ్రూపుకు చెందిన ఇన్‌ఫోసిస్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, నెస్లే కంపెనీలు మార్కెట్ ట్రేడింగ్‌లో నష్టాలతో ప్రారంభించాయి. అయితే సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బాలాజీ ఫైనాన్స్, టాటా స్టీల్ కంపెనీలు మాత్రం ఆర్జించాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోప్సీ, జపాన్‌కు చెందిన నిక్కీ, షాంఘైకి చెందిన ఎస్ఎస్ఈ .. ట్రేడింగ్‌లో కొంత పాజిటివ్ సంకేతాలు చూఇంచాయి. ఇక హాంగ్ కాంగ్‌కు చెందిన హంగ్ సెంగ్ తక్కువ ట్రేడ్ అయ్యింది.
సోమవారం మదుపరులలో ఉత్సాహం తొణికిసలాడింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు శాంతించడంతో స్టాక్ మార్కెట్లూ సోమవారం రఫాడించాయి. బయ్యింగ్ జోష్‌ను సంతరించుకున్నాయి. దీంతో సోమవారం ఒక్కరోజే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీలు మునుపెన్నడూ లేనివిధంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ ఏకంగా 2,975. 43 పాయింట్లు లేదా 3.74 శాతం ఎగబాకి 82,429.90 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 916.70 పాయింట్లు లేదా 3.82 శాతం ఎగిసి 24,924.70 దగ్గర నిలిచింది.
ఇటీవల దూసుకుపోయిన బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య ప్రతీకార సుంకాల విధింపు వాయిదా పడటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల నుంచి ఈక్విటీ మార్కెట్లకు తరలించడంతో భారీ స్థాయిలో ధరలు దిగొచ్చాయి.