AP | గ్రానైట్‌ లారీ బోల్తా.. ముగ్గురు మృతి

పర్చూరు : ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న క్రమంలో ఒక్కసారి బ్రేక్ వేయడంతో గ్రానైట్ పలకల లారీ బోల్తా పడింది. గ్రానైట్ పలకల లారీ మార్టూరు నుంచి పర్చూరు మీదుగా గుంటూరు వైపు వెళుతుండగా తిమ్మరాజుపాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం .. లారీపై కూర్చున్న ముగ్గురు వ్యక్తులు గ్రానైట్ పలకల క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు పాలేటి శ్రీను (మార్టూరు), తాళ్లూరి ప్రభుదాసు (మార్టూరు), తమ్ములూరి సురేంద్ర (నూతలపాడు)గా గుర్తించారు. మృతి చెందిన వారందరూ మార్టూరు, నూతలపాడు ఎస్సీ కాలనీలకు చెందిన వారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది.

గ్రానైట్ పలకలను దించి రావడానికి వెళుతూ మృత్యు ఒడిలోకి జారుకోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, పర్చూరు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గ్రానైట్ పలకలను తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Leave a Reply