TG | ఇందిర‌మ్మ ఇళ్ల‌లో త‌ప్పులు జ‌రిగితే మీరే బాధ్యులు – అధికారుల‌తో మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్ – నిరుపేదలకు గూడు కల్పించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం కింద పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఇందులో ఎలాంటి పొరపాట్లకు, తప్పులకు తావు ఉండొద్దని ఇంజనీర్లకు సూచించారు. ఆ బాధ్యతను ఇంజనీర్లపైనే పెడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయితే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. న్యాక్‌లో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.

న్యాక్ లో 390 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం న్యాక్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతి పొందిన వారికి ఆర్డర్ కాపీలను అందజేశారు. గృహ నిర్మాణ శాఖకు మంచి పేరు తేవాలని ఇంజినీర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఎక్కడ తప్పు జరగకుండా చూసే బాధ్యత ఇంజినీర్లదేనని చెప్పారు. ‘తప్పు జరిగిందని చెబితే చాలు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. టోల్‌ఫ్రీ నెంబర్‌ ఇస్తాం.. ఎవరైనా సరే దానికి ఫోన్‌ చేసి వివరాలు చెప్పవచ్చు. నిజమైన పేదలకే ఇళ్లు కేటాయించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఇందులో మరో మాట లేదు. అర్హులను ఎంపిక చేసేటప్పుడు అన్ని విషయాలూ పరిశీలించాలి. ఇళ్ల నిర్మాణంలో చిన్న ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదు’’ అని పొంగులేటి ఇంజనీర్లకు స్పష్టం చేశారు.

Leave a Reply