Peddapalli | ప్రభుత్వాసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

  • విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు
  • అభినందించిన జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష


పెద్దపల్లి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన ఒక మహిళకు ఆరు నెలల క్రితం సీజేరియన్‌ ఆపరేషన్‌ జరగగా, అప్పటి నుండి ఆమె అపెండిక్స్‌తో బాధ పడుతుంది. దీనిపై ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఫిజిషియన్‌ను సంప్రదించగా అపెండిక్స్‌గా నిర్ధారించడంతో అత్యవసర పరిస్థితుల్లో సదరు మహిళ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం చేరింది. వెంటనే జనరల్‌ సర్జన్‌ వైద్యుడు డా.సాయిప్రసాద్‌ మహిళను పరీక్షించి అడ్మిట్‌ చేసుకున్నారు.

శనివారం డా.సాయి ప్రసాద్‌, లాప్రోస్కోప్‌ వైద్య నిపుణుడు డా.అమరసింహ రెడ్డిలు కలిసి మహిళకు లాప్రోస్కోప్‌ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సర్జరీలో వైద్యులు డా.సాయి ప్రసాద్‌, డా.అమర సింహ రెడ్డి, సూపరింటెండెంట్ డా.కె.శ్రీధర్‌, డా.స్వాతి, డా. భవాని పాల్గొనగా, వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ప్రత్యేకంగా అభినందించారు. పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో అందిస్తున్న కార్పోరేట్‌ స్థాయి వైద్య సేవలను జిల్లాలోని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్‌ శ్రీహర్ష కోరారు.

Leave a Reply