- ఫైర్ సేఫ్టీ వారోత్సవాల్లో హైడ్రా కమిషనర్ సూచనలు
అగ్ని ప్రమాదాల నివారణకు ఏం చేయాలనే అంశంపై అందరిలో అవగాహన అవసరమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఫైర్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా హైడ్రా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ మాట్లాడారు.
ఒక్క అగ్ని ప్రమాదం కూడా జరగకూడదు అనే లక్ష్యంతో అందరూ కలసి పని చేస్తే తప్పకుండా అది సాధ్యమౌతోందని అన్నారు. ఫైర్ సేఫ్టీ విధానాలను అందరూ అనుసరించేలా చర్యలు తీసుకోవాలని.. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని సూచించారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తరచూ అగ్ని ప్రమాదాలు జరిగాయని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. ఈ సమస్యపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. అగ్ని ప్రమాదాలు ఎక్కడ ఎక్కువగా సంభవిస్తున్నాయి.. అందుకు గల కారణాలేంటి.. ఇలా సమగ్ర సమాచారంతో డేటా ఉంటే.. వాటిని నివారించడానికి మార్గాలు సులభతరం అవుతాయన్నారు.
అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తూ షార్ట్ ఫిల్మ్‌లు రావాలని కమిషనర్ సూచించారు. అంతకు ముందు హైడ్రా ఫైర్ విభాగం అదనపు సంచాలకులు పాపయ్య, హైడ్రా ఎస్‌పీ సుదర్శన్, హైడ్రా ఫైర్ విభాగం రీజనల్ ఆఫీసర్ జయప్రకాష్ అగ్ని ప్రమాదాల నివారణపై మాట్లాడారు.
ఆసుపత్రులు, కార్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలలో ఫైర్ సేఫ్టీ విభాగాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైన సూచనలు చేశారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఉద్దేశించిన పనిముట్లు వినియోగంపై అవగాహన ఉండాలన్నారు.