Achampet జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
Achampet జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
సీపీఎం అచ్చంపేట మండల కార్యదర్శి వర్ధం సైదులు డిమాండ్
అచ్చంపేట(Achampet), ఆంధ్రప్రభ:
అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అచ్చంపేట మండల కార్యదర్శి వర్ధం సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా జర్నలిస్టులు బాధ్యతాయుతమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో విలేకరుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే సామాజిక బాధ్యతతో జర్నలిజం రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని గత ప్రభుత్వం పదేళ్లపాటు హామీ ఇచ్చి అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు గత 14 సంవత్సరాలుగా ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాల హామీని తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
