Khammam నిరుపేద కుటుంబానికి రూ.4 లక్షల వైద్య సాయం

Khammam నిరుపేద కుటుంబానికి రూ.4 లక్షల వైద్య సాయం

మంత్రి తుమ్మల చొరవతో ఎల్‌వోసీ చెక్కు అందజేత

ఖమ్మం(Khammam), ఆంధ్రప్రభ:

నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని, పేదల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల యుగంధర్ తెలిపారు. ఖమ్మం నగరంలోని 31వ డివిజన్‌కు చెందిన గుంజా రామకృష్ణ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, చికిత్సకు అవసరమైన ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం స్థానిక నాయకుల ద్వారా తుమ్మల యుగంధర్ దృష్టికి చేరింది.

వెంటనే స్పందించిన ఆయన, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫార్సుతో బాధితుడికి వైద్య చికిత్స కోసం రూ.4 లక్షల విలువైన ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) చెక్కును మంజూరు చేయించారు. మంగళవారం హైదరాబాద్‌లో స్థానిక నాయకుల సమక్షంలో ఆ చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా గుంజా రామకృష్ణ మాట్లాడుతూ, తమ కుటుంబానికి అండగా నిలిచి వైద్య సహాయం అందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తుమ్మల యుగంధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ, పేదల సంక్షేమం, అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. నియోజకవర్గంలో ఏ పేద కుటుంబం కష్టాల్లో ఉన్నా వెంటనే స్పందించి సహాయం అందించడం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ లతీఫ్, కరాటే సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply