Indrakiladri | వేద పాఠశాలలో ప్రవేశాలకు అవకాశం..
Indrakiladri | వేద పాఠశాలలో ప్రవేశాలకు అవకాశం..
- అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
- ఉచిత వసతి, భోజనం, వస్త్రాలు..
- దేవాదాయ శాఖలో ఉపాధి అవకాశాలకు అవకాశం
- నూతన విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలోని వేద–శాస్త్ర పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ప్రకటించారు.
బుగ్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వవేదంతో పాటు సంబంధిత శాస్త్ర విద్యలను బోధించనున్నారు. వేద సంప్రదాయాల పరిరక్షణ, ప్రచారంతో పాటు భవిష్యత్ తరాలకు వేద విజ్ఞానాన్ని అందించడమే ఈ పాఠశాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రవేశం పొందదలచిన విద్యార్థులు ఆరోగ్యవంతులై ఉండటంతో పాటు సంధ్యావందనం చేయగలిగి, తెలుగు చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
శాస్త్ర విద్యలో ప్రవేశానికి 10 నుంచి 13 సంవత్సరాల మధ్య, వేద విద్యలో ప్రవేశానికి 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థులకు దేవస్థానం తరఫున పూర్తిగా ఉచిత వసతి, భోజనం, వస్త్రాలు, వేదాధ్యయనానికి అవసరమైన సామగ్రి అందజేయనున్నట్లు తెలిపారు.
విద్యాభ్యాసం పూర్తిచేసిన వారికి దేవాదాయ శాఖలో వివిధ అవకాశాలు లభించే అవకాశం ఉందని వెల్లడించారు. వేద విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు. మరిన్ని వివరాలకు 94401 36924 నంబరులో సంప్రదించాలని సూచించారు.
