khammam తుమ్మల యుగంధర్‌ చొరవ.. చర్చి కాంపౌండ్‌ బ్రిడ్జికి కొత్త భద్రత

khammam తుమ్మల యుగంధర్‌ చొరవ.. చర్చి కాంపౌండ్‌ బ్రిడ్జికి కొత్త భద్రత

  • వాహనదారులకు సురక్షిత ప్రయాణం.. భారీ శబ్దాలు, కుదుపులకు చెక్‌

ఖమ్మం(khammam), ఆంధ్రప్రభ:

ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్‌ బ్రిడ్జిపై నెలకొన్న సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. వంతెనపై జాయింట్ల మధ్య అమర్చిన రబ్బరు పట్టీలు పలు చోట్ల దెబ్బతినడంతో కాంక్రీట్‌ దిమ్మెల మధ్య ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వాహనాలు వెళ్లిన ప్రతిసారి భారీ శబ్దాలు, కుదుపులు ఏర్పడుతుండటంతో స్థానికులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను గుర్తించిన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు తుమ్మల యుగంధర్‌ వెంటనే స్పందించి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సంబంధిత అధికారులతో సమన్వయం చేసి మరమ్మతు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.

బ్రిడ్జిపై దెబ్బతిన్న జాయింట్ల స్థానంలో కొత్త రబ్బరు పట్టీలను అమర్చారు. కాంక్రీట్‌ దిమ్మెల మధ్య ఏర్పడిన ఖాళీలను సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా సరిచేశారు. అధికారుల పర్యవేక్షణలో చేపట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యాయి.

మరమ్మతుల అనంతరం బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. గతంలో ఎదురైన శబ్దాలు, కుదుపులు పూర్తిగా తగ్గిపోయాయని వాహనదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నామని పేర్కొంటున్నారు.

చర్చి కాంపౌండ్‌ బ్రిడ్జి సమస్యను సకాలంలో పరిష్కరించడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తుమ్మల యుగంధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా స్పందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ఇదే విధమైన చొరవ కొనసాగాలని ఆకాంక్షించారు.

Leave a Reply