గాలివాన బీభత్సం.. భారీ వేపచెట్టు నేలమట్టం
గాలివాన బీభత్సం.. భారీ వేపచెట్టు నేలమట్టం
చెట్టు విద్యుత్ డీపీపై పడడంతో సరఫరా నిలిచివేత
పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
పెనుకొండ, ఆంధ్రప్రభ: పెనుకొండ పట్టణంలోని ప్రధాన దర్గా కూడలిలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలుల ధాటికి అక్కడి భారీ వేపచెట్టు నేలకొరిగి సమీపంలోని విద్యుత్ డీపీపై పడింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
చెట్టు కూలిన సమయంలో ఆ మార్గంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సాధారణంగా వేపచెట్టు కింద తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే పలువురు వ్యాపారులు ఉంటారు. అయితే గాలివాన ప్రారంభమైన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.
రోడ్డుపైకి చెట్టు పడిపోవడంతో దర్గా కూడలిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్టు విద్యుత్ డీపీపై పడటంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మున్సిపల్, విద్యుత్ శాఖ సిబ్బంది వర్షాన్ని లెక్కచేయకుండా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిన చెట్టును తొలగించి, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు.
పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నారు.
