ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అండగా ప్రభుత్వం
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అండగా ప్రభుత్వం
326 మంది విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ
ప్రేమ, శ్రద్ధతో వారిని ముందుకు నడిపించాలి: కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం, ఆంధ్రప్రభ: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను అత్యంత ప్రేమతో, శ్రద్ధతో చూసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. వారి శారీరక పరిమితులు ప్రతిభకు అడ్డంకి కాదని, ప్రతి చిన్నారిలో అపారమైన సామర్థ్యం దాగి ఉందని పేర్కొన్నారు.
మంగళవారం భీమవరం పట్టణంలోని పీపీ రోడ్‌లో ఉన్న ప్రత్యేక మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో పాఠశాల విద్య సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన **“ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమం”**లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు సమాజానికి అమూల్యమైన సంపద అని అన్నారు. ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తమ లక్ష్యాలను చేరుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్య, వైద్యం, పునరావాసం, ప్రత్యేక శిక్షణ, సహాయక పరికరాల పంపిణీ వంటి అనేక రంగాల్లో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తూ పిల్లల సామర్థ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న దివ్యాంగుల పాఠశాలలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు.
సమగ్ర శిక్ష ఏపీసీ పి. శ్యాంసుందర్ మాట్లాడుతూ జిల్లాలోని 19 మండలాల్లో భవిత కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం–2016 ప్రకారం 0 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల మానసిక, బధిర, అంధత్వం, శారీరక తదితర 21 రకాల వైకల్యాలు గల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు.
విద్యార్థుల ప్రజ్ఞా స్థాయిలకు అనుగుణంగా విద్యాబోధన నిర్వహిస్తున్నామని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రవాణా భత్యం, ఎస్కార్ట్ అలవెన్స్, హెచ్‌బీఈ అలవెన్స్, గర్ల్స్ స్టైఫండ్ తదితర పథకాల కింద రూ.61 లక్షలను నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను క్షేత్రస్థాయిలో గుర్తించి, వైద్య నిపుణులు, ప్రత్యేక విద్యా నిపుణుల సూచనల మేరకు వారికి అవసరమైన సహాయక పరికరాలను అందిస్తున్నామని తెలిపారు. ఇవి విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడంతో పాటు వారి స్వతంత్ర జీవనానికి తోడ్పడతాయని పేర్కొన్నారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో 326 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్, కమోడ్ వీల్‌చైర్లు, వీల్‌చైర్లు, టీఎల్‌ఎం కిట్లు, క్రచ్‌లు, ట్రైసైకిళ్లు, స్క్రీన్ రీడర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్లు, బ్రెయిల్ కిట్లు తదితర సహాయక పరికరాలను పంపిణీ చేశారు.
కలెక్టర్ విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి తల్లిదండ్రుల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. తమ పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలవడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారి కలలకు కొత్త రెక్కలు తొడిగే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. కార్యక్రమ ప్రాంగణం చిన్నారుల ఆనంద కేరింతలు, తల్లిదండ్రుల సంతోషం, ఉపాధ్యాయుల అభినందనలతో సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ. నారాయణ, సమగ్ర శిక్ష డిటిసిలు దీవెనమ్మ, చంద్రశేఖర్, ఎంఈఓలు, అకౌంట్స్ అధికారులు, ప్రత్యేక ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
