ఓటర్ల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి
ఓటర్ల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయండి
భీమవరం, ఆంధ్రప్రభ: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై బీఎల్‌వోలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
మంగళవారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో భీమవరం నియోజకవర్గ బీఎల్‌వోల కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్‌ల వారీగా భీమవరం, వీరవాసరం మండలాల్లో జరుగుతున్న మ్యాపింగ్ పురోగతిని సమీక్షించారు.
భీమవరం అర్బన్ మండలంలో 55.54 శాతం, రూరల్ మండలంలో 63 శాతం, వీరవాసరం మండలంలో 64 శాతం మేర మ్యాపింగ్ పూర్తైందని, మొత్తం నియోజకవర్గంలో 59.98 శాతం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇంకా సుమారు 40 శాతం మ్యాపింగ్ పూర్తి కావాల్సి ఉందని, ఇతర ప్రాంతాలకు మారిన వారు లేదా ఆ చిరునామాలో లేని ఓటర్ల వివరాలను సేకరించి ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 95 శాతానికి పైగా మ్యాపింగ్ పూర్తి చేసిన బీఎల్‌వోలను అభినందించిన కలెక్టర్, వారిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన వారు కూడా వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. జవాబుదారీతనంతో, అంకితభావంతో పనిచేస్తే లక్ష్యాలను సులభంగా సాధించవచ్చన్నారు.
బూత్ లెవల్ అధికారులు 2002 ఓటర్ల జాబితా, 2025 తాజా జాబితాలను ఆధారంగా తీసుకుని పూర్తి పారదర్శకతతో మ్యాపింగ్ నిర్వహించాలని సూచించారు. ఇంటింటి సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలని, అవసరమైన ఫారం-6, ఫారం-7, ఫారం-8లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్ఠంగా వెయ్యి మంది ఓటర్లకు మాత్రమే పరిమితం ఉండేలా నిబంధనల మేరకు హేతుబద్ధీకరణ చేపట్టాలని ఆదేశించారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం షెడ్యూల్‌ను వివరిస్తూ, జూన్ 5 నుంచి 14 వరకు శిక్షణ, ప్రింటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే చేపడతారని, జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారని వెల్లడించారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ జరగనుండగా, సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా విడుదల కానుందని చెప్పారు.
ఓటరు నమోదుకు అవసరమైన పత్రాలపై కూడా కలెక్టర్ వివరించారు. 1987 జూలై 1కు ముందు జన్మించినవారు, 01.07.1987 నుంచి 02.12.2004 మధ్య జన్మించినవారు, 02.12.2004 తర్వాత జన్మించినవారికి వేర్వేరు ధ్రువపత్రాలు అవసరమవుతాయని తెలిపారు. జనన ధ్రువపత్రం, విద్యా ధ్రువపత్రాలు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డులు తదితర పత్రాలను వినియోగించవచ్చన్నారు.
ఇంటింటి సర్వే ద్వారా డూప్లికేట్ ఓటర్లు, మరణించిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను గుర్తించి జాబితా శుద్ధి చేపడతామని చెప్పారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువత, మహిళలు, దివ్యాంగులు, వలస కార్మికుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జూన్ 15 నుంచి జూలై 14 వరకు నిర్వహించే ఇంటింటి సర్వే కోసం సిద్ధం చేసిన కిట్లను జిల్లా కలెక్టర్ బీఎల్‌వోలకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో భీమవరం ఆర్డీవో, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి కె. ప్రవీణ్‌కుమార్ రెడ్డి, మున్సిపల్ సహాయ కమిషనర్ ఎ. రాంబాబు, తహసీల్దార్లు రావి రాంబాబు, రామాంజనేయులు, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
